రాయపాటి ఫ్యామిలీ ప్యాకేజి

 

గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, కుటుంబ సభ్యులంతా కలిసి టీడీపీలో చేరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయన వెంట వెళ్తారని భావించిన రాయపాటి, ఆ తర్వాతి కాలంలో మనసు మార్చుకుని టీడీపీ వైపు మొగ్గు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజకీయ శిష్యుడు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాత్రం ఇంకా ఏ విషయమూ నిర్ణయించుకోలేదు. ఆయన కూడా వస్తారేమోనని ఇన్నాళ్లూ వేచి చూసిన రాయపాటి, ఇక ఆలస్యం చేయడం అవనసరమని, ఎన్నికలు దగ్గర పడుతున్నందున అధికారికంగా చేరిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తన సోదరుడితో ప్రకటన చేయించేశారు. తమ కుటుంబమంగా టీడీపీలో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వెల్లడించారు.

 

ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్గీయులుగానే ముద్రపడి, ఆ పార్టీకి ఎనలేని సేవచేసిన తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు సైతం తమ కుటుంబం పార్టీకోసం ఎంతో పాటుపడిందనీ, కానీ తమ సోదరుడు సాంబశివరావుకు సరైన ప్రాధాన్యమివ్వలేదు సరికదా సమైక్యవాదం వినిపించినందుకు సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందని చెప్పారు. తొలుత రాజకీయాల నుంచే తప్పుకుందామనుకున్నామనీ, అభిమానుల కోరిక మేరకు ఈనెల 31నగానీ, వచ్చేనెల 4వ తేదీన గానీ టీడీపీలో చేరనున్నామని వివరించారు. తమతోపాటు రాయపాటి మోహనకృష్ణ కూడా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.