రాయపాటి ఇన్.. మోదుగుల ఔట్

 

నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సోమవారం నాడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అదే ముహుర్తానికి మోదుగుల టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ, లేదా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది.

 

నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బావ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బరిలో ఉండటంతో మోదుగులకు ఆ టిక్కెట్టు ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చారు. ఆ స్థానం నుంచి రాయపాటికి అవకాశం కల్పించారు. పోటీలో ఉన్నది బావే అయినా తాను వెనకాడేది లేదని, పార్టీ తరఫున గట్టిగా పోరాడతానని మోదుగుల చెప్పినా ఫలితం లేకపోయింది. దాంతో ఇక పార్టీని వీడాల్సిందేనని ఆయన నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అదే స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.