నిరాశలో టీ-వాదులు!

 

 

 

కేంద్రంలో చకచకా మారుతున్న పరిణామాలు తెలంగాణ వాదులలో నిరాశను కలిగిస్తున్నాయి. మొన్నటి వరకూ అంతా తమకు అనుకూలంగా వున్నాయని అనుకుంటున్న పరిస్థితులు రోజు రోజుకు మారుతూ రాయల తెలంగాణ వరకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోందన్న వార్తలు రావడంతో తెలంగాణ వాదులు ఖిన్నులయ్యారు.

 

రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని అన్ని పార్టీలకు చెందిన తెలంగాణవాదులు తేల్చేసి చెప్పేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు సంబంధించిన ఆందోళన ఇంకా అందరి మనసులలో వుండగానే, శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువంటూ వచ్చిన వార్తలు విభజనవాదులను మరింత ఆందోళనకు గురిచేశాయి. శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ బిల్లు ఈ సమావేశాలలో వచ్చే అవకాశం లేదన్న సంకేతాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి. ఇది టీ-వాదులను పూర్తి నిరాశలో ముంచేసింది.


అయితే అవకాశం లేదు లేదంటూనే ఈ సమావేశాల్లోనే టీ బిల్లు తేవడానికి కృషి చేస్తామని కేంద్రం చెప్పడం టీ-వాదులలో ఏదో ఒకమూల ఆశ మిణుకు మిణుకుమనేలా చేసింది. అయితే కేంద్రం ఈ సమావేశాల్లో టీ-బిల్లు తేదని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో తెలంగాణ అంశాన్ని ఎవరూ ఊహించని విధంగా టేబుల్ ఐటమ్‌గా ఆమోదించిన చరిత్ర కాంగ్రెస్‌కి వుంది. అదే తరహాలో ఎవరూ ఊహించని విధంగా బిల్లును పార్లమెంటులో ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిరాశ అలమకుని వున్న తెలంగాణ వాదులు కేంద్రం తమ విషయంలో సానుకూలంగా వుంటుందన్న అభిప్రాయంలో వున్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఈ కృషిలో పూర్తిస్థాయిలో నిమగ్నమై వున్నారు.