సి.ఎం.గారు డోర్‌ డెలివరీ ఎక్క‌డ‌?

వలంటీర్ల వల్లే కరోనా కేసులు గుర్తించామని, ఇంటింటికీ తిరిగి వెంటనే గుర్తించడం వల్లే వైరస్‌ వ్యాప్తిని నివారించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హుల ఇళ్లకే చేరవేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, వాస్త‌వానికి వలంటీర్ల వ్యవస్థ ఆచరణలో చేష్టలుడిగింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

గ్రామ వాలెంటీర్లు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నారా? లేక రాజ‌కీయ‌నేత‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నారా? ప్రజలకు, ప్రభుత్వానికి వారదిలా ఉండేలా వలం

టీర్ల వ్యవస్థ ప‌ని చేస్తుంద‌న్నారు. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా అయితే ప్రభుత్వం ఇచ్చింది కానీ రేష‌న్ తీసుకోవ‌డానికి జ‌నం ఇళ్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చి రోడ్డు మీద నిల‌బ‌డే దుస్థితి ఎందుకు వ‌చ్చింది? క‌నీసం ఈ ఆప‌ద స‌మ‌యంలో ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలెంటీర్లు ఎందుకు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. వలంటీర్లు ప‌త్తాలేక‌పోవ‌డంతో రేష‌న్ షాపుల ఎదుట జ‌నం భారీగా క్యూ క‌ట్టారు. ఎండ‌లో నిల‌బ‌డాల్సిన దుస్థితి. గంటల కొద్దీ క్యూలలో అగచాట్లు ప‌డి ఇంటికి సరుకులు తీసుకువెళ్తున్న దృశ్యాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌నిపిస్తున్నాయి. రేషన్‌ డోర్‌ డెలివరీ లేక పోవ‌డంతో కార్డుదారులే షాపులకు వచ్చి తీసుకెళ్ళుతున్నారు. ఉదయం నుంచే షాపుల ఎదుట క్యూ కట్టారు. డీలర్లు గీసిన మార్కింగ్‌లు కూడా దాటి బారులు తీరుతున్నారు.

 

 

రేషన్‌ కోసం కార్డుదారులు బారులు తీరడాన్ని చూస్తే వలంటీర్లు ఏమయ్యారనే ప్రశ్న వినవస్తోంది. అసలు వారి జాబ్‌చార్ట్‌లోని కీలక అంశమే రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఇళ్లకు వచ్చి సరుకులు ఇస్తారనుకుంటే ఇప్పుడు కూడా ఆ ఊసే లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.