పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ దీక్ష

 

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పార్లమెంట్ ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంట్ ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌పై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ‘నా పుట్టినరోజు సందర్భంగా మోడీ ఏమైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అని రామ్మోహన్‌ నాయుడు డిమాండ్ చేశారు. దాదాపు ఏడాదిగా పార్లమెంట్‌ ఆవరణలో తాము నిరసన తెలియజేస్తున్నామన్న ఆయన.. బీజేపీని ఓడించవచ్చన్న ధైర్యాన్ని దేశంలోని ఇతర పార్టీలకు తాము కల్పించామన్నారు. ఏపీకి రైల్వే జోన్‌ ఇస్తే తమకు అభ్యంతరం లేదని ఓడిశా ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ మోడీ జాప్యం చేస్తున్నారని  రామ్మోహన్‌నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 

 

మరోవైపు ఏపీకి న్యాయం చేయాలంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతీ రోజు పలు రకాల వేషధారణలతో పార్లమెంటుకు వస్తున్న ఎంపీ ఈరోజు జానపద కళాకారుడు వంగపండు వేషంలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న మోడీ ఎన్నికలయ్యాక అన్నీ మరిచాడంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా రైల్వేజోన్ ఇతర హామీలను మరిచిన మోడీని ఓడించడానికి కదిలి రావాలంటూ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ జానపదాలు పాడుతూ శివప్రసాద్ నిరసనను తెలియజేశారు.