తెలంగాణకు మరో ‘కరెంట్’ షాక్

 

కొత్త రాష్ట్రం ఏర్పాటు సంగతేమోగానీ, తెలంగాణ ప్రజలు కరెంటు సమస్యతో సతమతమైపోతున్నారు. కరెంటు లేక బోర్లు నడవక పంటలకు నీరు లేక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు సమస్యని ఎలా పరిష్కరించాలో, రైతుల ఆత్మహత్యలను ఎలా ఆపాలో అర్థం కాక తెలంగాణ ప్రభుత్వం సతమతమవుతోంది. కృష్ణానది బోర్డు వద్దని చెబుతున్నప్పటికీ శ్రీశైలంలో విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తూ పరిస్థితి మరీ దిగజారకుండా తెలంగాణ ప్రభుత్వం తంటాలు పడుతోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తెలంగాణ ప్రభుత్వానికి కరెంటు విషయంలో మరో చిక్కు వచ్చి పడింది. కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్‌టీపీసీ నాలుగవ యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అసలే కరెంటు లేక అల్లాడిపోతున్న తెలంగాణ రాష్ట్రానికి రామగుండంలో కూడా కరెంటు ఉత్పత్తి ఆగడం మరింత ఇబ్బందిగా మారే ప్రమాదం వుంది.