మంత్రి రాంరెడ్డి కి శ్రీ చైతన్య స్కూల్ 35 లక్షల లంచం.. !

 

 

రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డికి తమ స్కూల్ నిర్వహణ కోసం దాదాపు 35 లక్షల రూపాయలు లంచం ఇచ్చామని ఖమ్మం జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం హైకోర్టు కెక్కింది. జిల్లాలోని ఎన్కూర్ లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ యాజమాన్యం కరస్పాండెంట్ గుగులోట్ చిన్న, హెడ్ మాస్టర్ రమేష్ లు మంత్రిఫై ఈ పిటీషన్ వేసి సంచలనం సృష్టించారు.

 

మంత్రితో పాటు ఇతర అధికారులకు కూడా దాదాపు 15 లక్షల రూపాయలు ఇచ్చామని వారు హైకోర్టు కు తెలియచేసారు. అయితే, ఈ పిటీషన్ ను స్వీకరించిన ధర్మాసనం లంచం ఇచ్చిన వారిఫైన కూడా చర్యలు తప్పవని పేర్కొంటూ, దీనిఫై విచారణ సంక్రాంతి తర్వాత ఉంటుందని ప్రకటించింది. సుమారు మూడు సంవత్సరాల క్రితం తమ పాఠశాల ఏర్పాటు సమయంలో వీరందరికీ ఈ లంచాలు ఇచ్చామని పాఠశాల యాజమాన్యం అంటోంది.

 

తమ పాఠశాలను మూసివేయాలని మంత్రి ఇచ్చిన సూచనల మేరకే ఎంఇఓ తగిన ఉత్తర్వులు జారీ చేసారని, వాటిని నిలిపివేయాలని వారు ఆ పిటీషన్లో పేర్కొన్నారు.

 

అసలు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలంటే ఇలాంటి వారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా వారు ఆ పిటీషన్లో పేర్కొన్నారు. అసలు ఈ లంచం విషయం ఎలా ఉన్నా, పిటీషనర్లు ప్రస్తావించిన ఈ అంశంఫై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాల్సిఉంది.