రామ్‌చరణ్ రాజకీయం

 

 

 

తండ్రి చిరంజీవి రాజకీయంగా చాలా పూర్ అని సాక్ష్యాధారాలతో నిరూపణ అయిపోయింది. ఈ విషయంలో చిరంజీవితోపాటు ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే రామ్ చరణ్ మాత్రం రాజకీయాలు నడపడంలో తండ్రిలాంటి వాడు కాదన్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకసారి రామ్ చరణ్ టాలెంట్ బయటపడింది. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుకు ఎదురుతిరిగి మాట్లాడే సాహసం ఎవరూ చేయరు. ఆయన ఎవరిమీదైనా ఇన్‌డైరెక్ట్ గా కామెంట్లు చేస్తే, ఆ కామెంట్లు తగిలినవాళ్ళు కిక్కురుమనకుండా వుండటం తప్ప లేనిపోని తలనొప్పుడు ఎందుకని బయటపడరు.

 

అయితే రామ్ చరణ్ మాత్రం ఓ సందర్భంలో దాసరి మీద డైరెక్ట్ ఎటాక్ ఇచ్చాడు. ఆ విషయం అప్పట్లో చినికి చినికి గాలివానలా మారి మళ్ళీ తగ్గిపోయింది.  అప్పటి వరకూ రామ్ చరణ్ తండ్రిచాటు బిడ్డ అనుకున్నవాళ్ళు రామ్ చరణ్‌లోని దూకుడును చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు రామ్ చరణ్ తాను బాబాయితో లేనని స్పష్టంగా ప్రకటించి తనకి ఎలాంటి మొహమాటాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా గురువారం నాడు రామ్ చరణ్ పుట్టినరోజు వుందని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో రాజకీయ మీటింగ్ పెట్టాడు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళాలా.. పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి వెళ్ళాలా అని అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు.



ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తన పుట్టిన రోజు వేడుకలకు రాకపోయినా పర్లేదు బాబాయి మీటింగ్‌కే వెళ్ళండని ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా సందేశం ఇవ్వడం ద్వారా రామ్ చరణ్ తనలో వున్న పరిణతిని ప్రదర్శించాడని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన పక్షంలో నేను చెప్పాను కాబట్టే అంతమంది వచ్చారని చరణ్ అనొచ్చు. ఒకవేళ్ళ పవన్ మీటింగ్‌కి అభిమానులు తక్కువగా వస్తే నా పుట్టిన రోజునే మీటింగ్ పెట్టడం వల్లే అభిమానులు హాజరు కాలేదని మరో కోణంలో మాట్లాడొచ్చు. తన కత్తికి రెండువైపులా పదును వుండేలా చూసుకున్న ‘మగధీర’ రామ్ చరణ్ భవిష్యత్తులో రాజకీయ రంగంలో రాణించడానికి అర్హతలు వున్న వ్యక్తిలా ఇప్పటి నుంచే ప్రూవ్ చేసుకుంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.