టీడీపీ రాజ్యసభ సభ్యులు దాదాపు ఖరారు!

రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటం మనకు తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధులను ఆపార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు ప్రకటించనున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుని అభ్యర్ధుల కసరత్తు ఉంటుందని అంటున్నారు. దేశ రాజధానిలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

రాజ్యసభ సీట్ కోసం పలువురు సీనియర్లు ఆసక్తి చూపిస్తుండగా, ఆశావహులందరితో చంద్రబాబు ఇప్పటికే విడివిడిగా మాట్లాడారని సమాచారం. మొత్తానికి, ఈ రోజు మధ్యాహ్నం కల్లా అభ్యర్ధుల పేర్లని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఇప్పటికే రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న సీఎం రమేష్, సీనియర్ నాయకుడు వర్ల రామయ్య రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.