అవసరమైతే మొదటి అణు దాడి మేమే చేస్తాం: పాక్ కు రాజనాథ్ సీరియస్ వార్నింగ్

 

యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులలోను అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతం కాగా ఇపుడు జమ్మూ కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ రెచ్చగొడుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. భారత్ తో తలపడటానికి జిహాద్ తప్ప వేరే మార్గం లేదని అలాగే అణు యుద్ధం కూడా తప్పదని మొన్న పాక్ అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా రాజనాధ్ పాక్ కు ఇలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అని, ఇప్పటివరకూ భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉందని ఐతే భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అయన అన్నారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.