రైల్వే మంత్రి బన్సాల్ రాజీనామా

Publish Date:May 10, 2013

 

రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, తన మేనల్లుడు విజయ్ సింగ్లీ రూ.90లక్షలు లంచం తీసుకొంటూ పట్టుబడటంతో, తప్పని పరిస్థితుల్లో ఈ రోజు తన పదవికి రాజీనామా చేసారు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశం అయిన తరువాత ఆయనను పదవి నుండి తొలగించాలని నిర్ణయం జరగడంతో ఈ రోజు ఆయన తన రాజీనామా పత్రాన్ని ప్రదానికి సమర్పించారు.

 

ఇక, ఒకవైపు మంత్రుల రాజినామాలకై ప్రతిపక్షాల ఒత్తిడి, మరో వైపు సుప్రీంకోర్టులో చివాట్లు, ఇంకోపక్క తరుముకొస్తున్న ఎన్నికలు అన్ని కలిసి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచి చివరికి  రైల్వే మంత్రి రాజీనామాకు దారితీసింది. ఇక మరో బలమయిన కారణం ఏమిటంటే, సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్న తరువాత, అటు సీబీఐలోను, ఇటు ప్రభుత్వంలోను కూడా కొంచెం చలనం వచ్చిందని చెప్పవచ్చును. ఆ కారణంచేతనే సీబీఐ నేరుగా రైల్వేశాఖా మంత్రి కార్యాలయ అధికారులను ప్రశ్నించడానికి దైర్యంగా తన వద్దకు రప్పించుకోంగలిగింది. బహుశః ఆ కారణంగానే ప్రభుత్వం కూడా సీబీఐకి అడ్డు చెప్పలేకపోయింది.

 

సీబీఐ ఎప్పుడయితే తన అధికారులను ప్రశ్నించడానికి పిలిపించుకొందో, అప్పుడే బన్సాల్ మంత్రిగారికి కూడా జ్ఞానోదయం అయింది. సీబీఐ తీగలాగడం మొదలు పెట్టింది కనక డొంకంతా కదలక తప్పదని ఆయన ముందుగానే అందులోంచి బయటపడాలని రాజీనామా చేసారు. అయితే ఆ డొంకలో తీగలు ఈ రోజు కాకపోతే రేపయినా ఆయన కాళ్ళకు చుట్టుకోకమానావు. రైల్వే బోర్డులో సభ్యుడిగా నియమానికి రూ.10కోట్లు లంచం ఇవ్వబడుతోందంటే, దానిని బట్టి రైల్వే శాఖలో అవినీతి ఏస్థాయిలో వేళ్ళూనుకొని ఉందో అర్ధం అవుతోంది.