కాంగ్రెస్ పార్టీ.. ఓ అబద్ధాలపుట్ట.. ట్విట్టర్‌లో పాత ఫొటో!

 

అబద్ధాలు చెప్పే సబ్జెక్టులో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవార్డు ఇవ్వొచ్చు. ప్రస్తుతం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా వున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీకి లేనిపోని బిల్డప్పు ఇవ్వడం కోసం కూడా తెగ అబద్ధాలు చెప్పేస్తోంది. వారణాసిలో శనివారం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించాడు. కాంగ్రెస్ పార్టీ ఇదే రాహుల్ గాంధీ వారణాసి రోడ్ షో అంటూ బాగా జనాలున్న ఓ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టింది. ఆ ఫొటో చూసి నిజమేననుకుని దేశవ్యాప్తంగా అనేక నెట్ మ్యాగజైన్లు, నెట్ మేగజైన్లు తమ న్యూస్‌లో సదరు ఫొటోని పోస్ట్ చేశాయి. దాన్ని చూసిన జనం అబ్బో వారణాసిలో రాహుల్ ర్యాలీకి ఎంతమంది వచ్చారో అనుకున్నారు. అయితే బీజేపీ మాత్రం వారణాసిలో రాహుల్ ర్యాలీకి జనం ఏమంతగా రాకపోయినా ఫొటోలో మాత్రం ఇంతమంది జనం వున్నారేంటా అని పరిశోధన మొదలుపెట్టింది. తీరా చూస్తే వారణాసి పేరుతో ట్విట్టర్‌లో పెట్టిన ఫొటో ఎప్పటిదో పాత ఫొటో అని తేల్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో అందరి దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో నాలుక్కరుచుకున్న కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌‌లో పెట్టిన పాత ఫొటో తీసేసింది. జనంలేని వారణాసి ర్యాలీ ఫొటో పెడితే బాగోదని అనుకుందేమోగానీ, ఏ ఫొటో పెట్టలేదు.