రాహుల్ టార్గెట్ 2014: కిరణ్, బొత్స తో భేటి

 

 

Rahul Gandhi to meet state unit chiefs today, Rahul Gandhi  kiran kumar reddy, Rahul Gandhi boitsa satya narayana

 

 

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు, రేపు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో పార్టీ పటిష్ఠతపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావడానికి బొత్స సత్యనారాయణ నిన్న ఢిల్లీ చేరుకోగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీ ఎన్నికల్లో విజయావకాశాలకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చిస్తారు.


ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ కూడా ఆయనతో వేర్వేరుగా, కలిసి చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ, సంస్థాగత సమస్యలు, వైసీపీ ప్రాబల్యం, టీడీపీ అధినేత పాదయాత్ర, తెలంగాణ తదితర అంశాలపై వారిద్దరి అభిప్రాయాలను రాహుల్ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రెండురోజుల్లో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నట్లు సమాచారం.


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్ రాష్ట్రస్థాయి నేతలను కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ సోనియాతోనే పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు అలవాటుపడ్డ ఈ నేతలు ఇప్పుడు నేరుగా రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.