రాహుల్‌కే మళ్లీ ఏఐసీసీ పగ్గాలు..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం... మరోవైపు దశబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో స్వయంగా తానే ఓడిపోవడంతో... అటు ప్రత్యర్ధుల నుంచి... ఇటు సొంత పార్టీ నేతల విమర్శల నుంచి తప్పించుకోవడానికి, రాజీనామా  హైడ్రామా నడిపి, చివరికి ఏఐసీసీ పీఠం నుంచి కిందకి దిగిన రాహుల్ గాంధీకే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు రంగంసిద్ధమైంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతోన్న సోనియాగాంధీ మరోసారి తన తనయుడికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధిక వయసు, ఆరోగ్య సమస్యలతో గతంలోనే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని రాహుల్ కి పార్టీ పగ్గాలు కట్టబెట్టిన సోనియా... ఇప్పుడు మరోసారి అవే కారణాలతో తప్పుకునేందుకు సిద్ధమైనట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా తర్వాత భారీ హైడ్రామానే నడిచింది. రాహుల్ రాజీనామా చేయొద్దంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. అంతేకాదు... రాహుల్ రాజీనామా చేస్తే... తమకూ ఈ పదవులు వద్దంటూ మద్దతుగా పార్టీ పోస్టులకు రాజీనామాలు సైతం చేశారు. అయితే, ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ లో భాగమేనని చర్చ జరిగింది. ఇక, ప్రత్యర్ధులైతే ఇదంతా పెద్ద హైడ్రామా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అయితే, సోనియా వయోభారం, అనారోగ్య సమస్య కారణంగా అనివార్య పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది. జనవరిలో జరిగే ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ ను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి.