మీ విమానం మాకేమీ వద్దు.. గవర్నర్ కి రాహుల్ కౌంటర్!

 

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ప్రధాని మోదీ ఈ విషయమై దృష్టిసారించాలని.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘రాహుల్‌ను కశ్మీర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఆయన కోసం నేనో విమానాన్ని పంపిస్తా. ఇక్కడ పర్యటించి ఆ తర్వాత మాట్లాడాలి. మీరో బాధ్యతాయుతమైన నేత అయ్యుండి ఇలా బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని మాలిక్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ కోసం ఓ విమానం పంపుతానని గవర్నర్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. "డియర్ గవర్నర్ మాలిక్. నాతో కూడిన విపక్ష నేతల బృందం, మీ ఆహ్వానం మేరకు జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటనకు వస్తోంది. మీ విమానం మాకేమీ వద్దు. అయితే, మేము స్వేచ్ఛగా తిరిగి, ప్రజలను కలుసుకుని, వారితో మాట్లాడే విషయంలో సహకరించండి. రాష్ట్ర నేతలను, సైనికులను కలుసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోకండి" అని రాహుల్ వ్యాఖ్యానించారు.