అటు ఎంఐఎం.. ఇటు టీఆర్‌ఎస్‌.. ఇద్దరూ బీజేపీకే

 

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీద విమర్శల దాడి చేశారు. ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రజలు తమకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, నీళ్లు నిధులు, నియామకాలు అన్నీ తమకే అని కలలు కన్నారు. కానీ, ఈ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఆశించినట్లుగా ఏమీ చేయలేకపోయింది. ప్రజల కలలను కేసీఆర్‌ వమ్ము చేశారు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణను 2 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంటే .. కేసీఆర్‌ కొడుకు ఆదాయం మాత్రం 4వందల రెట్లు పెరిగిందని విమర్శించారు. రూ.40 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టు వ్యయాన్ని 80వేల కోట్లకు పెంచారని, కేసీఆర్‌ ప్రాజెక్టు పేరు మార్చి 40 వేల కోట్ల దోపిడీ చేశారని రాహుల్‌ మండిపడ్డారు.

లక్ష ఉద్యోగాలు అని చెప్పి యువతను కేసీఆర్‌ మోసం చేశారు. ఎన్ని ఉద్యోగాలో వచ్చాయో యువతే చెప్పాలి. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ కేసీఆర్‌ మోసం చేశారు అని రాహుల్‌ విమర్శించారు. మహిళా సంఘాలకు కూడా కేసీఆర్‌ అన్యాయం చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఎన్నో ఆశలు చూపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీ మోసంగా మారింది అని విమర్శించారు.

ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కటేనని ఆరోపించారు. మోదీకి అవసరమైన ప్రతిసారీ కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు. మోదీ దేశాన్ని ఎప్పుడూ విభజించే పనిలో ఉంటారు. కేసీఆర్‌ మద్దతుతో ప్రజల మధ్య మోదీ వివక్ష చూపుతున్నారు. పార్లమెంట్‌లో పాసైన ప్రతి బిల్లుకూ కేసీఆర్‌ మద్దతు ఉంది. టీఆర్‌ఎస్‌ అంటే ‘తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌పరివార్‌’ అని ఎద్దేవాచేశారు. ఇప్పటి వరకు రాఫెల్ గురించి కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అటు ఎంఐఎం.. ఇటు టీఆర్‌ఎస్‌ ఇద్దరూ బీజేపీకే మద్దతిస్తున్నారని ఆరోపించారు. ముగ్గురిని మూకుమ్మడిగా ఓడిస్తేనే దేశానికి విముక్తి కలుగుతుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని, కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని జోస్యం చెప్పారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు, నియమకాల కలను నిజం చేస్తామని అన్నారు. 'అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్ ఇస్తాం. మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.500 కోట్లు కేటాయిస్తాం. పేదలకు ఇళ్లు.. దళితులు, గిరిజనులకు భూమి ఇస్తాం. యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం. తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం' అని రాహుల్‌ భరోసా ఇచ్చారు.