లోక్‌సభలో రాహుల్ గాంధీ బ్యాక్ బెంచ్ బాయ్!

 

బుధవారం 16వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు.. ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. అయితే, సోనియాకు ముందు వరుసలోని ప్రతిపక్ష స్థానంలో సీటు కేటాయించారు. కానీ... రాహుల్‌కు మాత్రం లోక్‌సభలో వెనుక వైపు తొమ్మిదో వరుసలోని ఓ సీటును కేటాయించారు. లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి రాహుల్ విముఖత చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని అవ్వాలని కలలు కన్న రాహుల్ గాంధీ చివరికి లోక్ సభలో బ్యాక్ బెంచ్ బాయ్ అయ్యాడు పాపం. రాహుల్ గాంధీ పక్కన కాంగ్రెస్ సభ్యులు శశి థరూర్, అస్రార్ ఉల్ హక్‌లు కూర్చున్నారు. ప్రతిపక్ష పార్టీ ముందు వరుస సీట్లలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే, వీరప్ప మొయిలీ, కెహెచ్ మునియప్పన్‌లు కూర్చున్నారు. ఇదిలావుండగా రాహుల్ గాంధీకి వరుసకు సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా అధికార పక్షం విభాగంలో వెనుక వరుసలోనే కూర్చున్నారు. 15వ లోక్‌సభ సమావేశాల్లో 206 మంది సభ్యులను కలిగి ఉన్న కాంగ్రెస్, 16వ లోకసభ సమావేశాలకు 44 మంది సభ్యులకు పడిపోయిన విషయం తెల్సిందే. అలాగే, గత పదేళ్ల నుంచి స్పీకర్‌కు కుడివైపున కూర్చొనే కాంగ్రెస్ సభ్యులు ఇపుడు ఎడమవైపుకు మారారు.