ఇక్కడ కేసీఆర్.. అక్కడ మోదీ

 

తెలంగాణలో ముందస్తు వేడి మొదలవడంతో రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఇప్పటికే భైంసాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్, మోదీ మీద విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అదే ఊపులో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన రాహుల్.. అదే స్థాయిలో మళ్ళీ కేసీఆర్, మోదీపై విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంపై రాష్ట్ర ఉద్యమం కొనసాగిందని, ప్రజా ఉద్యమం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనను గెలిపించారని, తెలంగాణలో కొత్త శకాన్ని తీసుకొస్తారని ప్రజలు ఆశించారని అయితే కేసీఆర్‌ పాలనలో ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు. తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మద్దతుధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేశారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. కుటుంబ పాలన తీసుకువచ్చారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరిపైన రూ. 2.60 లక్షల అప్పు ఉందని అన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు డబ్బు లేవు కానీ, కేసీఆర్‌ తన ఇంటి నిర్మాణానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇంటింటికి నల్లా ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ అవినీతికి పాల్పడుతున్నారు రాహుల్ అని అన్నారు.

నోట్ల రద్దుపై మోదీ నిర్ణయం తీసుకోగానే దేశమంతా వ్యతిరేకించినప్పటికీ కేసీఆర్ బేషరతుగా మద్దతిచ్చారని రాహుల్ గుర్తు చేశారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని, వారి పాలనలో ఒకేరకమైన పోలికలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీకి కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని, కేసీఆర్‌తో పాటు ఎంఐఎం కూడా మోదీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్ గల్ఫ్‌ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గల్ఫ్‌ బాధితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. చెప్పిన మాటలను వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తుంది. అబద్దపు మాటలు విని మోసపోవాలనుకుంటే మోదీ, కేసీఆర్‌ వైపు వెళ్లండి అన్నారు. నాలుగు విడతలు కాదు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.