మోదీని ఓడించడమే ప్రధాన లక్ష్యం

బీజేపీని ఓడించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.రాహుల్ గాంధీ అవకాశం దొరికిన ప్రతిసారి కేంద్రంపై,మోడీపై విరుచుకుపడుతున్నారు.హిందుస్థాన్‌ టైమ్స్‌ నాయకత్వ సదస్సులో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్రంపై మరో మారు విమర్శలు గుప్పించారు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించింది.వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. రూపాయి విలువ పతనమయింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎన్నడూలేనంత స్థాయికి చేరాయి. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం పెరిగిపోయింది. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ విధానంతో లక్షలాది చిన్నతరహా వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రజల ఆకాంక్షలు ఆగ్రహరూపం సంతరించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా దళితులు ఆందోళన పథంలో ఉన్నారు. మైనార్టీలపై మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి.భారత్‌ గురించి తమకు తప్ప ఈ దేశంలో మరెవ్వరికీ ఏమీ తెలియదన్న భావన ప్రభుత్వ పెద్దల్లో గూడుకట్టుకుపోయింది. వాళ్లు ప్రజలను నమ్మరు. వారి గొంతు వినరు. ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదు అని ధ్వజమెత్తారు.

 

 

మిత్రపక్షాలు కోరుకుంటేనే ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమని ప్రకటించారు.కలిసొచ్చే పార్టీలతో జతకట్టి మోదీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమనీ, మిగతావన్నీ ఎన్నికల తర్వాతేనని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాయవతితో పొత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లో సీట్ల సర్దుబాట్లపై సంప్రదింపులు జరుగుతుండగానే బీఎస్పీ సొంత పంథాలో వెళ్లిపోయిందనీ, వారి వైఖరి తమపై ప్రభావం చూపదన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణల్లో తమకు విజయావకాశాలు దండిగా ఉన్నాయని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు.తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేస్తామని చెప్పారు. రైతులకు అండగా నిలవడంతోపాటు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య, వైద్య వ్యవస్థను నిర్మిస్తామన్నారు.