తెలుగు ప్రజలతో విడదీయలేని అనుబంధం మాది: రాహుల్

 

ఈరోజు హిందూపురంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం బుగ్గగిల్లి జోకెట్టినట్టుంది. తమ పార్టీకి తెలుగు ప్రజలతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో చిరకాలంగా విడదీయలేని అనుబంధం ఉందని, కేవలం తమ పార్టీ మాత్రమే ప్రజాభిప్రాయానికి విలువనిస్తుందని అన్నారు. తన తల్లి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తాను ముగ్గురు కలిసి గట్టిగా పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలా అని తను తీవ్రంగా ఆలోచిస్తున్నానని చెప్పారు. తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

నేడు తమ పార్టీ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తామని చెపుతున్న రాహుల్, లక్షలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి రెండున్నర నెలలుగా ఆందోళన చేసినప్పుడు ఆయనకు ఈవిషయం గుర్తుకు రాలేదు. తెలుగు ప్రజలతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని చెపుతున్న రాహుల్ గాంధీ, గత పదేళ్లుగా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతుంటే, వందలాది విద్యార్దులు ప్రాణాలు పోగొట్టుకొంటుంటే, ఉద్యమాల కారణంగా రాష్ట్రం అభివృద్ధి కుంటుపడినప్పుడు, సామన్యుల జీవితం దుర్బరమయ్యి అల్లలాడుతున్నపుడు ఏనాడు కూడా రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చింది లేదు, పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నం చేసిందీ లేదు. కానీ నేడు ఉద్యమాల వేడి చల్లారిన తరువాత, రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత ఇప్పుడు తాపీగా వచ్చి తెలుగు ప్రజలతో తమ అనుబంధం గురించి మాట్లాడుతున్నారు.