రాహులయ్యా.. జరా భద్రమయ్యా!

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకూ కూడా ఆగేట్టులేడు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా ప్రధాని పీఠం ఎక్కి కూర్చోవాలని ఆరాటపడిపోతున్నాడు. అందుకు అర్జెంటుగా ప్రజలకు చేరువయిపోవడం ఒక్కటే మార్గమని భావించి బారికేడ్లు దూకేసి మరీ జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. జనాలకి చేరువ కావడం అంటే ఫిజికల్‌గా వాళ్ళ దగ్గరకి వెళ్ళడం అని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడేమో. అందుకే జనం మధ్యలోకి దూరిపోతున్నాడు. జనానికి దగ్గర కావడం అంటే వాళ్ళ మనసులకు నచ్చడం అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో.

 

మొన్నీమధ్య ఓ ఎన్నికల మీటింగ్‌కి వెళ్ళిన రాహుల్ బారికేడ్లు దూకేసి అడ్డదారిలో ప్రజల దగ్గరకి వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఇలా చెప్పాపెట్టకుండా చేస్తున్న సాహసాలకు సెక్యూరిటీ సిబ్బంది బిత్తరపోయి హడావిడి పడిపోతున్నారు. అసలే రాహుల్ గాంధీ “నాకు ప్రాణభయం వుంది దేవుడో.. మా నాయనమ్మ, మా నాన్నలాగా నా ప్రాణాలకు గ్యారంటీ లేదని” చెబుతూ వుంటాడు. మరోపక్క ఇలాంటి సాహసాలు కూడా చేస్తూ వుంటాడు. ఇది సెక్యూరిటీ సిబ్బందికి లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతోంది. 1991లో రాజీవ్ గాంధీ కూడా ఇలాగే అతి చొరవ చూపించి జనాల్లో కలిసిపోవడం వల్ల ఎంత అనర్థం జరిగిందో తెలిసిందే.

 

అందువల్ల రాహుల్ గాంధీ కాస్త జాగ్రత్తగా వుంటే బెటర్. ఈసారి ఎన్నికలలో కాకపోతే వయసు వుంది కాబట్టి ఆపైసారో మరోసారో ఎన్నికలలో పోటీ చేసి గెలవగలిగితే ప్రధానమంత్రి అయినా అవ్వొచ్చును. ఈసారికి మాత్రం నరేంద్రమోడీ పుణ్యమా అని తనకు ప్రధాని కుర్చీలో కూర్చొనే భాగ్యం దక్కదని గ్రహించినా రాహుల్ గాంధీకి ఆ తహతహ మాత్రం తగ్గట్లేదు పాపం. అందుకే రిస్క్ తీసుకొని బారికేడ్లు దూకేస్తున్నారుట. కానీ రాహుల్ గాంధీ లేనిపోని సాహసాలు చేయకుండా, కొంచెం జాగ్రత్తగా మసులుకొంటే మంచిదని ఆయన్ని అభిమానించేవారు, అభిమానించని వారు కూడా అనుకుంటున్నారుట! అంటే బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చని వారి అభిప్రాయమో..ఏమో...