సౌత్‌ సినీ పితామహుడికి గుర్తింపేది..?

 

 

 

 

భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరుపుకుంటున్న శుభ తరుణంలో భారత రాష్ట్రపతి సాక్షిగా దక్షిణ భారత సినిమాకు అవమానం జరిగింది..

 

ఇండియన్‌ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా భారత ప్రభుత్వం 50 మంది సినీ ప్రముఖుల స్టాంపులను విడుదల చేసింది.. అందులో ముగ్గురు తెలుగు వారికి కూడా స్థానం లభించటం గర్వకారణమే.. కాని దక్షిణా భారత సినిమా పితామహుడు పేరుగడించిన మహానుభావుడు.. తొలి థియేటర్‌ నిర్మాత అయిన రఘుపతి వెంకయ్యకు ఆ గౌరవం దక్కకపోవటం మాత్రం బాధాకరం..

        తెలుగు నుంచి అల్లురామలింగయ్య, భానుమతి రామకృష్ణ, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖుల స్టాంపులను విడుదల చేశారు.. వీరు అందుకు అర్హులే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. కాని వీరికన్నా ముందే తెలుగు వారి కీర్తి ఇతర దేశాల్లో కూడా చాటి చెప్పిన రఘుపతి వెంకయ్య గారిని గుర్తించకపోవటానికి కారణం ఏంటి..?

        ఆయన భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను 1981లో ఆయన పేరిట రఘుపతి వెంకయ్య అవార్డును నెలకొల్పిన ప్రభుత్వం ఈ వందేళ్ల సంబరాల్లో మాత్రం ఆయన్ను ఎందుకు చిన్న చూపు చూసింది..?

        1906లో క్రోనోమెగాఫోన్‌ అనే ప్రొజెక్టర్‌ను 30వేల రూపాయల ఖర్చుతో కొని ఇతర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చిన ఆయన.., తరువాత పూర్తి స్థాయి థియేటర్‌ను నిర్మించిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. 1912లోనే చెన్నై మౌంట్‌ రోడ్‌లో ఆయన నిర్మించిన గైటీ థియేటర్‌ దేశంలోనే తొలి పూర్తి స్థాయి థియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాదు రెండో ప్రయత్నంగా క్రౌన్‌ థియేటర్‌ను నిర్మించిన ఘనత కూడా ఆయనదే.

        ప్రస్థుతం స్టాంపుపై ముద్రితమవుతున్న తెలుగు వారిలో అల్లు రామలింగయ్య, భానుమతి రామకృష్ణలు ఇద్దరు గతంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న వారే.. అలాంటిది ఆ మహానుభావుడికి ఈ భారతీయ సినిమా వందేళ్ల సంబరాల్లో సముచిత స్థానం దక్కకపోవటం చాలా బాధాకరం..