కేసీఆర్ గుట్టు బయట పెట్టిన రఘునందన్ రావు

 

ఇంటిగుట్టు బయటకి పొక్కి లంకకు చేటు తెచ్చినట్లు, తెరాసలో ప్రముఖ నేతగా ఎదిగిన రఘునందన రావును పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడ్డాడని పార్టీనుండి బహిష్కరించడంతో ఆయన కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యుల గుట్టు బయటపెట్టారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం పేరిట పారిశ్రామిక వేత్తలను, విద్యాసంస్థలను, వ్యాపార సంస్థలను బెదిరించి కోట్ల రూపాయలు పోగేసుకొన్నారని ఇంతవరకు ముఖ్యమంత్రితో సహా విపక్షాలు కూడా చేస్తున్న ఆరోపణలను దృవీకరిస్తూ రఘునందన రావు అనేక ఆసక్తికరమయిన విషయాలు బయట పెట్టారు.

 

తనపై లేనిపోని ఆరోపణలు చేసిన కేసీఆర్ తనకు 48గంటలలో క్షమాపణ చెప్పాలని లేకుంటే ఇంతవరకు అతనికి ఎవరెవరు ఎన్నని చెక్కులు ఇచ్చేరో ఆధారాలతో సహా బయట పెడతానని ఆయన హెచ్చరించారు. ఆయన తెలంగాణా కోసం లాబీయింగ్ పేరిట డిల్లీలో నెల రోజుల మకాం ఎందుకు వేసారో, అప్పుడు కేవీపీతో సహా ఎవరెవరు ఎంతెంత చెక్కులు అందించారో తానూ బయట పెడతానని హెచ్చరించారు.

 

అదేవిధంగా హరీష్ రావు, కె.తారక రామారావు ఇద్దరూ కూడా ఉద్యమాల పేరిట బలవంతపు వసూల్లకు పాల్పడ్డారని అందరికీ తెలుసునని ఆయన ఆరోపించారు. హరీష్ రావు తనను కూడా డబ్బు కోసం పీడించేవాడని రఘునందన రావు ఆరోపించారు. ఆయన అడిగిన డబ్బు ఈయకపోవడంతో తానూ యం.యల్సీ ఎన్నికలలో పోటీచేస్తున్నపుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కలిసి తనకు వ్యతిరేఖంగా పనిచేసేవారిని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.

 

ఒకానొక సమయంలో హరీష్ రావు తెరాస అధ్యక్షుడి పదవి నుండి కేసీఆర్ ను తప్పించి, తానూ ఆ పదవి చెప్పట్టాలని ప్రయత్నించారని, ఆ సంగతి కేసీఆర్ కి తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. తానూ చంద్రబాబు నాయుడిని ఎన్నడూ కలవక పోయినప్పటికీ, కలిసానని ఆరోపిస్తూ పార్టీ నుండి సస్పెండ్ చేసిన కేసీఆర్, హరీష్ రావు 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెళ్లి వై.ఎస్.ను కలిసి వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించ లేకపోయారని అడిగారు.

 

ఇక కేసీఆర్ నోటి దురుసుకి పార్టీలో సీనియర్ నేతలు సైతం చాల బాధ పడుతున్నారని, అందరూ ఆయన నోటికి బలయిన వారేనని తెలిపారు. కేసీఆర్ చివరికి ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్ వంటి వారిని సైతం నోటికి వచ్చినట్లు దూషించేవారని అన్నారు. కోదండరామ్ ను జేయేసీ చైర్మన్ పదవి నుండి తప్పించి, దానిని తన వారికి కట్టబెట్టాలని ప్రయత్నించారని కానీ, అందరూ దానికి తీవ్రంగా వ్యతిరేఖించేసరికి కేసీఆర్ వెనక్కి తగ్గారని రఘునందన్ రావు తెలిపారు.

 

డబ్బు కోసం ఆశపడి హత్యలు చేసిన వారికి, తెలంగాణా ఉద్యమాలతో సంబంధం లేని వ్యాపారులకు పార్టీ టికెట్స్ అమ్ముకొంటూ, కేసీఆర్ ఇటు కార్యకర్తలని అటు తెలంగాణా ప్రజల్నీ కూడా మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. గ్రానైట్ వ్యాపారి గంగుల కమలాకర్ ని పార్టీలోకి తీసుకొని ఎంతో కాలంగా పార్టీకోసం కష్టపడిన నారదాసు లక్ష్మణరావు వంటి వారిని కూడా కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కనుక తనకు క్షమాపణలు చెప్పకపోతే ఆతని రహస్యాలన్నీ బయట పెడతానని రఘునందన్ రావు హెచ్చరించారు.