రాఫెల్‌ రచ్చ.. మరో మచ్చ

 

బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కాంగ్రెస్ కి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. కాంగ్రెస్ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా రాఫెల్ స్కాం అంటూ బీజేపీ మీద విమర్శలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఈమధ్య కాలంలో రాఫెల్ అనే పదం లేకుండా స్పీచ్ ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. కాంగ్రెస్ రాఫెల్ తో బీజేపీని అంతలా టార్గెట్ చేసింది మరి. దానికి తగ్గట్టే రాఫెల్‌ యుద్ధవిమానాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.

రాఫెల్స్‌ను తయారుచేసే సంస్థ డసో ఏవియేషన్‌ తన ఉద్యోగ సంఘాలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలను వెల్లడించే మరో రెండు పత్రాలు తాజాగా లీకయ్యాయి. పోర్టెయిల్‌ ఏవియేషన్‌ అనే ఫ్రెంచి వెబ్‌సైట్‌ వీటిని బయటపెట్టింది. అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను ఎందుకు తాము భాగస్వామిగా ఎంచుకోవాల్సి వచ్చిందో డసో ఏవియేషన్‌ డిప్యూటీ సీఈవో లోయిక్‌ సెగాలెన్‌ ఇచ్చిన వివరణ ఈ పత్రాల్లో ఉంది. సీఎఫ్‌డీటీ, సీజీటీ అనే రెండు ట్రేడ్‌ యూనియన్లతో సెగాలెన్‌ 2017 మే 11న జరిపిన సమావేశపు మినిట్స్‌ను పోర్టెయిల్‌ ఏవియేషన్‌ ప్రచురించింది. 'డసో రిలయన్స్‌ ఏరోస్పేస్‌ పేరుతో నాగ్‌పుర్‌లో ఒక సంస్థను ఏర్పాటు చేయడాన్ని వివరిస్తూ.. భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాల ఎగుమతి కాంట్రాక్టును పొందడం కోసం ఈ పరిహారాన్ని డసో ఏవియేషన్‌ ఆమోదించడం తప్పనిసరైంది’ అని పేర్కొంది. భారత్‌లో తయారీని ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో భాగంగా ఇది భారత్‌ విధించిన తప్పనిసరి పరిణామం అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసం రిలయన్స్‌తో భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.