మీ రచ్చబండ మండ!

 

 

 

కాంగ్రెస్ పార్టీ లాంటి అన్నీ వదిలేసిన పార్టీ గూగుల్‌లో వెతికినా దొరకదేమో! రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని పూనుకోగానే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి తెలంగాణ పర్యటనని బహిష్కరించాలని పిలుపు ఇచ్చేశాడు. విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అయితే, ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికే రావడానికి వీల్లేదు.. ఆయన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులెవరూ తెలంగాణకు ఆహ్వానించడానికి వీల్లేదంతే అంటూ హుకుం జారీ చేశాడు. రచ్చబండలో ముఖ్యమంత్రితో కలసి పాల్గొనాల్సిన మంత్రులు మాకు వేరే అర్జెంటు పనుందని తప్పించుకున్నారు.. చివరికి అందరూ కలసి రచ్చబండనే రద్దుచేశారు. ఇంత కంగాళీ పార్టీ, ప్రభుత్వం సోమాలియాలో కూడా ఉండదేమో!

 

 

మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి అలా ప్రకటించాడో లేదో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రచ్చబండ నిర్వహణకి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. ముఖ్యంమంత్రితో రచ్చబండకి హాజరు కావలసిన తెలంగాణ మంత్రులు ‘‘మేం సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభలో పాల్గొంటున్నాం కాబట్టి మేం రానేరాం’’ అనేశారు. ముఖ్యమంత్రి రచ్చబండలో పాల్గొంటే నానా న్యూసెన్సూ చేస్తామని కాంగ్రెస్ నాయకులే వార్నింగులు ఇచ్చారు. దాంతో ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు.




వీళ్ళ రాజకీయాల గొడవేంటోగానీ, రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగితే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్నయినా తీరేవి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చెబుతున్నాడు. మెదక్ జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో ఈసారి సీఎం మెదక్ జిల్లాకు రెండు వందల కోట్ల రూపాయల నిధులు ప్రకటించాలని అనుకున్నారని, దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులే చెడగొట్టారని విమర్శిస్తున్నాడు. అయినా సీఎం తెలంగాణలో పర్యటించకుండా ఎవరూ చేయలేరని, త్వరలో లక్షమందితో సంగారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని, దానికి సీఎం కూడా హాజరవుతారని జగ్గారెడ్డి ప్రకటించాడు. ఈ వ్యవహారమంతా చూసి తెలంగాణ ప్రజలు మీ రచ్చబండ మండ అని గొణుక్కుంటున్నారు.