పవన్ తెదేపా ఏజెంటా?

 

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తెలంగాణాలో కూడా పోటీ చేస్తుందనే సంకేతాలు ఈయకపోయి ఉంటే, బహుశః తెరాస నేతలు అసలు ఉపన్యాసం గురించి పట్టించుకొనేవారే కాదేమో. కానీ, ఆయన ఆంధ్ర తెలంగాణా రెండు ప్రాంతాలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు, తమ రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లు చూచాయగా చెప్పడంతో, తెరాస తప్పనిసరిగా స్పందించవలసి వచ్చింది. తాము భూస్థాపితం చేసేశామనుకొన్న తెలుగుదేశం పార్టీ ఇటీవల మెహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజాగర్జన సభ విజయవంతం కావడం, దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేందుకు సిద్దపడటం చూసిన తెరాస అప్రమత్తమయి వారిరువురినీ లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి ఆరంబించింది.

 

తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన తరువాత, తెరాస నేత హరీష్ రావు తెదేపా, జనసేనలపై తన అస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మేకప్ & ప్యాకప్ పార్టీ అని కవిత విమర్శిస్తే, హరీష్ రావు మాత్రం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఏజెంటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసారని విమర్శిస్తూ, ఆ రెండు పార్టీలను ఒకే గాట కట్టి, ఆంద్ర పార్తీలనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.

 

అయితే కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ కూడా తమ పార్టీకి ఎన్నికలలో ఎదురే ఉండదని, తమ పార్టీయే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నపటికీ, కవిత, హరీష్ రావు తెదేపా, జనసేనలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూస్తే, తెరాస తన ప్రత్యర్ధులను చూసి భయపడుతోందని అర్ధమవుతోంది.

 

అందుకు ప్రధాన కారణం నేటికీ తెరాసకు తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు లేకపోవడం, నేటికీ పార్టీ గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణం జరగక పోవడమే. నేటికీ తెరాస తెలంగాణా సెంటిమెంటు మీదే ప్రధానంగా ఆధారపడి ఎన్నికలకి వెళుతోంది తప్ప, పార్టీ క్యాడర్ మరియు తన నేతల బలం చూసుకొని మాత్రం కాదని నిర్ద్వందంగా చెప్పవచ్చును. అందుకే తన ప్రత్యర్ధులు ఏమాత్రం బలపడినట్లు కనబడినా వెంటనే వారిపై తెరాస నేతలు అందరూ కట్టకట్టుకొని విరుచుకు పడుతుంటారు. ఇప్పుడూ వారు అదే చేస్తున్నారు.