ఏమిటీ ప్రోరోగం?

 

వెయ్యెకరాల పచ్చని మాగాణి పోతే పోయింది గానీ ‘లా’ క్షుణ్ణంగా తెలిసి వచ్చిందన్నట్లు జగన్ మూలంగా ఇప్పుడు సామాన్య ప్రజలకి కూడా సీబీఐ, కోర్టులు, కేసులు, బెయిలు, పిటిషన్లు, అనుమతులు వగైరా అంశాల గురించి చక్కటి అవగాహన ఏర్పడింది.

 

అదేవిధంగా రాష్ట్రవిభజన వ్యవహారంలో ఉత్తుతి కమిటీలు, కోర్ కమిటీలు, ఉత్తుత్తి రాజీనామాలు, జీఓయం, చట్టంలో ఉన్న వివిధ ఆర్టికల్స్, విభజన సాంప్రదాయాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా అర్ధం అయింది. నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెండు అంశాలలో పీ.హెచ్.డీ. పొందడానికి అన్నివిధాల అర్హులని ఒప్పుకోక తప్పదు. అయితే ఈ ప్రక్రియలో శాసనసభ, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందవలసి ఉంది గనుక, ఈ లోగా ప్రజలకి మరికొంత జ్ఞాన సముపార్జన చేసుకొనే సౌలభ్యం ఉంది.

 

గత రెండు రోజుల నుండి ‘ప్రోరోగ్’ అనే మాట అందరి నోట వినిపిస్తోంది. అంటే అదేదో వైద్య పరిభాషకు చెందిన ఏ అంటూ రోగమో అని కొందరు కాదు రోగ్ అంటే ప్రజాప్రతినిధులు ఒకరినొకరు తిట్టుకొనే 'తిట్టు' అని మరి కొందరు వాడులాడుకొంటున్నారు. అయితే దానర్ధం ఏమిటంటే మళ్ళీ ప్రభుత్వం కోరేవరకు శాసనసభని నిరవదికంగా వాయిదా వేయడమన్నమాట. ఇది శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత జరిగే సాధారణ తంతుగా చెప్పుకోవచ్చును.

 

ఈ ఏడాది జూన్ 23వరకు శాసనసభ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వం నుండి సభను ప్రోరోగ్ చేయమంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి ఎటువంటి అభ్యర్ధన రాలేదు. కానీ, ఇక నేడో రేపో శాసనసభను సమావేశపరిచి తెలంగాణా బిల్లుపై చర్చ చెప్పట్టవలసిన తరుణంలో సభని ప్రోరోగ్ చేయమని కోరుతూ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుండి లేఖ వచ్చిందని మీడియాలో పైలిన్ తుఫాను కంటే భీభత్సంగా చర్చలు జరుగుతున్నాయి.

 

మీడియాలో ఇంత హంగామా జరుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఇద్దరు వేరే ఏదో గ్రహాంతర ప్రయాణంలో ఉండి ఇది గమనించలేకపోయినట్లు ఇద్దరూ ఇంతవరకు నోరు మెదపట్లేదు. ఇదే అదునుగా రాజకీయ నేతలు, పార్టీలు, వాటి మీడియాలు ఈ ప్రోరోగం గురించి తీవ్రంగా చర్చిస్తూ, ప్రజలకి కూడా దాని పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి.

 

అధికారికంగా ఈ ప్రోరోగం గురించి ఎటువంటి వివరణ లేనందున మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కాసింత చొరవ తీసుకొని “అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోతే దానిని మళ్ళీ ఎప్పుడు సమావేశపరచాలన్నది స్పీకర్ పరిధిలో ఉంటుందని, ప్రొరోగ్ అయితేనే అప్పుడు ప్రభుత్వం పరిధిలోకి వెళ్తుందని” ఆయన తెలిపారు.

 

అంటే ఇప్పుడు సభను ప్రోరోగ్ చేయమని ముఖ్యమంత్రి నుండి విజ్ఞప్తి లేదా ఆదేశాన్ని స్పీకర్ అమలు చేయనవసరంలేదని అర్ధం అవుతోంది. స్పీకర్ కి కూడా చాలా ముందుగానే డిల్లీకి పిలిచి చెప్పవలసినదంతా చెప్పడం అయిపోయింది గనుక ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా స్పీకర్ శాసనసభ సమావేశాలు నిర్వహించడం ఖాయం.

 

సభను ప్రోరోగ్ చేసినంత మాత్రాన్న తెలంగాణా బిల్లూ ఆగదు, ఏర్పాటూ ఆగదని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా బాగానే తెలుసు గనుక, ఆయన ‘నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదనే’ భ్రమలో ఉండే ఆవకాశం లేదు. ఇటువంటి ప్రోరోగోపాయలు కేవలం అధిష్టానాన్ని కొంచెం అల్లరి పెట్టేందుకు, టెన్షన్ పెట్టేందుకే తప్ప బిల్లుని ఆపలేవు.

 

ముఖ్యమంత్రి శాసనసభలో జరిగే చివరి రాద్ధాంతంలో పాల్గొని మీడియా లైవ్ కవరేజ్ ఇస్తుంటే ధాటిగా ప్రసంగించి రాజీనామా చేసి సమైక్య ఛాంపియన్ ట్రోఫీ పట్టుకొని బయటపడవచ్చును. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం వల్ల ప్రజలకి ‘ప్రోరోగం’ అంటే అంటు వ్యాధి, తిట్టు కానేకాదనే మరో కొత్త విషయం తెలుసుకొనే అవకాశం కలిగితే, మీడియాకు మూడు నాలుగు రోజులకు సరిపడే మేత దొరికిందని చెప్పవచ్చును.