ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై భ‌క్తుడు విమర్శలు చేస్తాడా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు చెబితే నటుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌లో ఎక్కడ లేని పూనకం వస్తుంది. అతడి మాటలకు ఆకాశం కూడా అడ్డుకట్ట వేయలేదు. ఇంటర్వ్యూలు, న్యూస్ ఛాన‌ల్స్‌లో లైవ్ డిబేట్స్‌, సినీ ఆడియో వేడుకలు... సమయం, సందర్భం ఇవేవీ ఆయనకు పట్టవు. పవన్ భజనలో మునిగి తేలతాడు. 'పవన్ భక్తులందు బండ్ల బాబు వేరయా' అన్నంత పేరు తెచ్చుకున్నాడు. తాజా వార్త ఏంటంటే...

 

 

ఈ భక్తుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అందులో పెద్ద వింతేమీ లేదు. ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ లేదు. గతంలో ఓసారి ఇతడు రాహుల్ గాంధీని కలిశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని పలు సందర్భాల్లో చెప్పాడు. అప్పట్లో ఎవరూ బండ్ల గణేష్ మాటల్ని విశ్వసించలేదు. జనసేన పార్టీలో చేరతాడని పవన్ కల్యాణ్ భక్తులు ఆశించారు. బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూద్దామని  రాజకీయ విశ్లేషకులు భావించారు. అదంతా గతం. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరాడనేది వర్తమానం. భవిషత్తులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఈ భ‌క్తుడు విమర్శలు చేస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం. పార్టీల పరంగా భగవంతుడిది, భక్తుడిది వేర్వేరు దారులు. పవన్ జనసేన అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పడదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో 'పంచెలు ఊడేలా కొడతా' అని పవన్ చేసిన విమర్శలను ఇంకా ఎవరూ మరువలేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో పవన్ కల్యాణ్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. తెలంగాణ కావొచ్చు.. ఎన్నికల్లో రెండు పార్టీలు పోటీ పడతాయి. పోటీలో భాగంగా బండ్ల గణేష్ తన దేవుడి మీద విమర్శలు చేయవలసిన సందర్భం వస్తే ఏం చేస్తాడోనని సినిమా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.