ప్రధాని నరేంద్ర మోడీ సూటు ఖరీదు 4.31 కోట్లు!

 

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కోసం లండన్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన సూటుని సూరత్ నగరంలో గల సైన్స్ కన్వెన్షన్ సెంటర్ లో వేలం వేయగా గుజరాతోలో ప్రముఖ వజ్రాల వ్యాపారి హితేష్ లాల్జీ భాయ్ పటేల్ రూ. 4.31 కోట్లు చెల్లించి స్వంతం చేసుకొన్నారు. ఈ వేలంపాటలో మొత్తం 11మంది పాల్గొనగా అందులో సూరత్ నగరానికే చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్ అత్యధికంగా రూ.2.0 కోట్ల వరకు వెళ్లి ఆగిపోయారు. మళ్ళీ తన వ్యాపార భాగస్వామి సంజయ్ మోవలియాతో మాట్లాడిన తరువాత రూ.2.31 కోట్ల వరకు వెళ్ళారు. కానీ అంతకు ముందు రూ. 2కోట్లు వరకు పాడి ఆగిపోయిన హితేష్ లాల్జీ భాయ్ పటేల్ తరువాత మళ్ళీ వేలంపాటని కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకి వేలం పాట ముగిసే సమయానికి ఆయన ఆ సూటుకి రూ. 4.31 కోట్లు చెల్లించేందుకు సిద్దం అవడంతో అది ఆయన స్వంతం అయింది.

 

ఈ మొత్తం సొమ్మును గంగానది ప్రక్షాళన ప్రాజెక్టుకి విరాళంగా ఇస్తామని బీజేపీ ప్రకటించడంతో ఈ వేలంపాటలో పాల్గొనేందుకు అనేకమంది పోటీ పడ్డారు. చివరికి హితేష్ లాల్జీ భాయ్ పటేల్ దానిని స్వంతం చేసుకొన్నారు. వేలం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక సత్కార్యంలో నేను కూడా ఈవిధంగా పాలుపంచుకొనే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోశిస్తున్నాను,” అని అన్నారు.