యుపీఏ విందు రాజకీయం

 

 

 

తెలంగాణా బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యుపీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో విందు రాజకీయానికి తెరతీసింది. లోక్ సభలో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి కావడంతో.. ఆ పార్టీ నాయకులను బుజ్జగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన విందుకు యుపీఏ తరఫున చిదంబరం, షిండే, కమల్ నాథ్ లు హాజరవనున్నారు. బీజేపీ అగ్రనాయకులందరినీ ఆహ్వానించిన విందు ప్రధాన ఎజెండా.. అడ్డంకులు లేకుండా, వీలైనంత ప్రశాంత వాతావరణం లో తెలంగాణా బిల్లును గట్టెక్కించడమే. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే సొంత పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులపై కాంగ్రెస్ వేటు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

 

తెలంగాణ బిల్లు లోపాల పుట్టలా ఉందని సీమాంధ్రతో పాటు తెలంగాణా ప్రాంతానికి చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తుండడంతో.. మద్దతుపై బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితోపాటు బిల్లుకు బీజేపీ మద్దతు అనుమానమే అన్న సంకేతాలు వెలువడ్డాయి. సీమాంధ్రకు అన్యాయం చేసే బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. మీ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు కుడా మద్దతివ్వని బిల్లుకు తామెలా మద్దతిస్తామని ఆయన బాహాటంగానే ప్రకటించారు. దీంతో మేలుకున్న కాంగ్రెస్ నాయకులు..నస్టనివారణ చర్యలు చేపట్టారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన తమ ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ముఖ్యమంత్రి పై కూడా చర్యలు తీసుకుంటామంటూ లీకులు ఇచ్చారు.

 

మొత్తంగా ఈ పరిణామం యుపీయేకు లాభం చేకూర్చేలా ఉంది. బిల్లులు బీజీపీ మద్దతిస్తే.. తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ దక్కుతుంది. ఒక వేళ బీజేపీ మద్దతు ఇవ్వకపోతే.. బిల్లు వీగిపోతుంది. మేము చేయాల్సింది అంతా చేసాం... బీజేపీ వల్లే బిల్లు వీగిపోయింది అని చెబితే తెలంగాణలో సానుభూతి దక్కుతుంది. ఈ విషమ పరిస్థితిని భారతీయ జనత పార్టీ ఎలా ఎదుర్కుతుందో వేచి చూడాల్సిందే......