‘టి’ విషయం తేల్చాలని ప్రణబ్ కు మంత్రుల రిక్వెస్ట్

 

 

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా విషయంలో ఓ స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోవడంతో, ఆ ప్రాంత నేతలు అధిష్టానం ఫై వత్తిడి తెచ్చేందుకు తమ సొంత మార్గాల్లో పయనిస్తున్నారు. తన హైదరాబాద్ పర్యటన చివరి రోజున రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆరుగురు రాష్ట్ర మంత్రులు బేటీ అయ్యారు.

 

తెలంగాణా విషయాన్ని త్వరగా తేల్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు ఆయనను కోరారు. ఈ విషయంఫై పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చొరవ తీసుకోవాలని హోం శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతా రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ శ్రీధర బాబు, నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి సారయ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత లక్ష్మ రెడ్డి నిన్న ఆయనను బొల్లారం లో కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకొంటే, మరలా కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా వారు రాష్ట్రపతితో అన్నారు.

 

ఆయన మంత్రులతో మాట్లాడుతూ, ఈ విషయంలో తనకు అన్ని విషయాలు తెలుసని, త్వరలోనే నిర్ణయం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన వంతు ప్రయత్నం తాను చేస్తానని కూడా ప్రణబ్ వారికి హామీ ఇచ్చారు.