అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

 

 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో కొత్తగా మరోమారు రాష్ట్రపతి పాలన విధించడంతో పార్లమెంటు ఆమోదానికి మరో రెండు నెలలు అవకాశం లభించినట్లయింది. అయితే ఇది ఇప్పటికే అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనకు కొనసాగింపు మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తోంది. కానీ, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటును సమావేశ పరిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనూ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దీంతో అసలు శాసనసభను రద్దు చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని కేంద్రం నిర్ణయించుకుంది.