100 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి

లాక్ డౌన్ మూలంగా వలస కూలీలు రోజువారీ పని లేక.. తినడానికి, ఉండటానికి వసతులు లేక.. వందల కిలోమీటర్లు నడిచి స్వగ్రామాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు నడుస్తూ మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఓ నిండు గర్భిణి భర్తతో కలిసి వంద కిలోమీటర్లు నడిచిందనే వార్త చలించిపోయేలా చేస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్పూర్‌లో ఓ యజమాని ఉన్నట్టుండి పనిలో నుంచి తీసేయడంతో.. 8 నెలల గర్భిణి యస్మీన్, ఆమె భర్త వకిల్‌ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతిలో డబ్బుల్లేవు, యజమాని తమకు రావాల్సిన జీతం కూడా ఇవ్వకపోవడంతో.. దంపతులిద్దరూ కాలినడకన స్వగ్రామానికి(బులంద్షహర్ జిల్లా అమర్‌గఢ్‌కు) బయల్దేరారు.

రెండు రోజుల పాటు దాదాపు 100 కిలోమీటర్లు నడిచి మీరట్‌కు చేరుకున్నాక యస్మీన్ తీవ్రంగా నీరసించిపోయింది. నడిచేపరిస్థితి లేకపోవడంతో వకిల్ ఆమెను తీసుకుని సోహ్రాబ్‌ బస్టాండ్ వద్దకు వెళ్లాడు. వీరిని గమనించిన స్థానికులు నవీన్ కుమార్, రవీంద్ర.. వారికి ఆహారం అందించడంతో పాటు.. వెంటనే నౌచండి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఓ అంబులెన్స్ ఏర్పాటు చేసి వారిని క్షేమంగా గ్రామానికి తరలించారు.