ఉంటారో..పోతారో.. అగమ్యగోచరంగా మారిన టీడీపీ పరిస్థితి

 

ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు నిమగ్నమయ్యారు. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ముగ్గురికి ఫోన్లు చేయడంతో టీడీపీలో అలజడి మొదలైంది. డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ముగ్గురు మంత్రులు సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ లు చేసి వారి యోగక్షేమాలు కనుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. టీడీపీకి ఉన్న 23 మంది శాసన సభ్యుల్లో కనీసం 6,7 మందిని ఆ పార్టీకి దూరం చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ప్రకాశం జిల్లాలో నాలుగు చోట్ల విజయం సాధించింది. చీరాలలో కరణం బలరాం, అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్, పరుచూరులో ఏలూరి సాంబశివరావు, కొండపిలో డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి గెలుపొందారు. వీరిలో ముగ్గురిని తమ వైపు లాక్కునే ప్రయత్నాలకు వైసీపీకి చెందిన మంత్రులూ బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. కొడాలి నాని, పేర్ని నాని తొలుత ఎమ్మెల్యే గొట్టిపాటితో మంతనాలు జరిపారు. పార్టీ మారేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన క్వారీల పై అధికారుల దాడులు ప్రారంభమయ్యాయి. అనంతరం బాలినేని కూడా రంగంలోకి దిగి రవి కుమార్ తో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది. 

ఇదే సమయంలో కొడాలి నాని పరుచూరు శాసన సభ్యుడు ఏలూరికి ఫోన్ చేసి వైసిపి లోకి రావాలని ఆహ్వానించారని అన్ని విధాలా ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల ఓ కార్యక్రమంలో కలిసిన కరణం బలరాంతో బాలినేని చర్చించి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్టు తెలిసింది. కొండపి ఎమ్మెల్యే స్వామి పార్టీ మారతారని ఆ నియోజక వర్గ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నా ఆయనతో ఏ మంత్రి మాట్లాడలేదని తెలిసింది. టిడిపి ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న మంత్రులు నిన్న విజయవాడలోని మంత్రి బాలినేని నివాసంలో సమావేశమై చర్చించినట్లు సమాచారం. వీరు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఇదే విషయం పై మాట్లాడబోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.