ప్రజావేదికను కూల్చినంత ఈజీ కాదు... తీర్మానం చేసినా రాత్రికి రాత్రే రద్దు కాదు..

 

మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసినా, ఇప్పటికిప్పుడు జరిగిపోదు. తీర్మానం చేసిన దగ్గర్నుంచి రద్దు ప్రక్రియ పూర్తవడానికి కనీసంలో కనీసం ఆరు నెలలైనా సమయం పడుతుంది. ఎందుకంటే, తీర్మానం వరకే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ, మండలిని రద్దు చేయాల్సిన ప్రక్రియ మొత్తం కేంద్రం చేతిలోనే ఉంది. మండలిని రద్దుచేస్తూ జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానం మొదట కేంద్ర హోంశాఖకు వెళ్తుంది. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంటుంది. చివరిగా రాష్ట్రపతి సంతకం చేశాకే ఏపీలో శాసనమండలి రద్దు అవుతుంది.

అయితే, ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కనీసం ఆర్నెళ్లు లేదా ఏడాది పడుతుందని అంటున్నారు. ఇదే, టీడీపీ ధీమాకి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాదిలోపు టీడీపీ ఎమ్మెల్సీ మెజారిటీ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఆ ఎమ్మెల్సీ స్థానాలన్నీ అధికార వైసీపీకే దక్కుతాయి. దాంతో, మండలి రద్దుతో టీడీపీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదని అంటున్నారు. అందుకే, రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చినంత సులువుగా మండలి రద్దు కాదని తెలుగుదేశం నేతలు జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా, మండలి రద్దు ప్రక్రియ మొత్తం కేంద్రం చేతిలోనే ఉన్నందున... మోడీ ప్రభుత్వానికి ఇష్టంలేకపోతే ఆగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న మండలి రద్దు ఆగిపోయినా ఆగిపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసింది. దాంతో, జగన్ ప్రభుత్వం తీర్మానం చేసినా,  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. 

అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.

మరోవైపు, మండలి రద్దు తీర్మానంపై ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశముందంటున్నారు. మండలిలో బిల్లులను అడ్డుకున్నారన్న కారణంతోనే కౌన్సిల్ రద్దు నిర్ణయం తీసుకున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.... చిక్కులు తప్పవని న్యాయనిపుణులు అంటున్నారు.