కోర్టుకెక్కిన ప్రభాస్

 

హైదరాబాద్‌ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారన్నారు. సీజ్‌ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల రాయదుర్గం పాన్‌ మక్తా సర్వే నంబర్‌ 46లోని 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. ఇందులో 2,200 గజాల్లో ప్రబాస్‌ గెస్ట్‌హౌస్‌ నిర్మించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్‌ చేశారు. గతంలో ఈ భూమిని జీవో నంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ ప్రభాస్‌ దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం.