తెదేపాలో పొట్లూరి ముసలం

Publish Date:Apr 17, 2014

 

ఈసారి ఎన్నికలలో విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న పొట్లూరి వరప్రసాద్, తెదేపా, వైకాపాలు ఆయనకీ టికెట్ నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ పంచన చేరి జనసేన పార్టీ స్థాపన కోసం విరివిగా డబ్బు ఖర్చు చేసారు కానీ, అయన కూడా ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటించడంతో హతాశులయ్యారు. అయితే ఎలాగో ఆయనను ఒప్పించి విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందువలన పొట్లూరి నేడో రేపో ఆయన విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయవచ్చును.

 

పవన్ కళ్యాణ్ తెదేపాకు మద్దతు ప్రకటించి ఈవిధంగా చేస్తుండటం తెదేపా కూడా జీర్ణించుకోలేపోతోంది. ఒకవేళ పొట్లూరి పోటీకి దిగితే, ఆయనకు సన్నిహితుడయిన పవన్ కళ్యాణ్ ఆయన తరపున ప్రచారంలో పాల్గొనవచ్చును. అదే జరిగితే అది పార్టీ అభ్యర్ధి కేశినేని నాని విజయావకాశాలను దెబ్బ తీయవచ్చును గనుక, తెదేపా కూడా ఈ వార్త తెలుసుకొని అప్రమత్తమయింది.

 

పవన్ కళ్యాణ్ తమ కంటే బీజేపీతోనే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతున్నందున, ఆ పార్టీ ద్వారానే ఆయనకు చెప్పించి పొట్లూరిని పోటీ నుండి విరమింపజేయాలని తెదేపా భావిస్తోంది. సందిగ్ధంలో పడిన తెదేపా-బీజేపీ పొత్తుల విషయమై మాట్లాడేందుకు ఈరోజు డిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ తో ఈవిషయాన్ని తెదేపా సీనియర్ నేతలు చర్చించవచ్చును.

 

అయితే అందుకు బీజేపీ అంగీకరించినా, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదా అనేది అనుమానమే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడుతున్న పొట్లూరి వరప్రసాద్ వెనక్కి తగ్గుతారా? అనేది మరొక ప్రశ్న. అంతిమంగా ఈ వ్యవహారంలో ఎవరివో ఒకరివి సంబంధాలు దెబ్బతినడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణం ఎన్నికలలో పోటీ చేయాలనే పొట్లూరి పట్టుదలే!

 

పొట్లూరి ఎన్నికలలో ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలనుకోవడంలో తప్పు లేదు, అది నేరమూ కాదు. అయితెహ్ ఆయన పోటీ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీకి పెట్టుబడి పెట్టడం వ్యాపార లక్షణమే. అయితే ఏ వ్యాపారస్తుడు కూడా తను పెట్టిన పెట్టుబడి నష్టపోవాలనుకోడు గనుకనే ఆయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇదే పని ఆయన తెదేపా, వైకాపాలు టికెట్ నిరాకరించిన్నపుడే చేసి ఉండి ఉంటే నేడు ఆయనను ఎవరూ ఈవిధంగా విమర్శించే అవకాశం ఉండేదే కాదు.

 

అయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతున్నపటికీ, ఆయనతో పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహ, (సినీ) వ్యాపార సంబంధాల కారణంగా లేదా ఆయన తన పార్టీ స్థాపనకు భారీగా డబ్బు ఖర్చు చేసినందున ఆయన తరపున ప్రచారం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే అది అందరికీ ఇబ్బందికరమే.

By
en-us Political News