పోసాని, అలీని మర్చిపోయారా? మోహన్ బాబుకి పదవి ఎప్పుడు?

 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... వైసీపీకి అండగా నిలిచిన సినీ ప్రముఖులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతోంది. 30 ఇయర్స్ పృద్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా... విజయచందర్ ను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా... నియమించింది. అయితే, ఇప్పటివరకు కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే పదవులివ్వగా, ఇంకా చాలామంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే, అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లు దాటిపోతున్నా... తమకింకా పిలుపురాలేదని కొందరు అలకపాన్పు ఎక్కారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ కంటే జూనియర్లను పిలిచిమరీ కీలక పదవులు కట్టబెడుతున్న జగన్.... తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. ముఖ్యంగా ఆ లిస్టులో అలీ, పోసాని, మోహన్ బాబు, జయసుధ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

హాస్యనటుడు అలీ, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విజయవాడ, లేదా గుంటూరులో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. అయితే, అప్పటికే అభ్యర్ధులు ఖరారు కావడంతో, అధికారంలోకి వస్తే, న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు అలీకి జగన్ నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక,  చంద్రబాబుపై మొదట్నుంచీ ధాటిగా విమర్శలు కురిపించిన వ్యక్తుల్లో పోసాని మురళి ఒకరు. అయితే, పోసానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి పిలుపూ రాలేదు. దాంతో పోసాని కాస్త ఆవేదనకు లోనైనట్టు తెలుస్తోంది. ఇక, మంచు మోహన్ బాబు... సీఎం జగన్ కు స్వయానా బంధువు.... అయితే, ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు.... చంద్రబాబుపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు. ఊరూరా తిరిగి వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. దాంతో, వైసీపీ అధికారంలోకి వస్తే... మోహన్ బాబుకి కీలక పదవి గ్యారంటీ అని ప్రచారం జరిగింది. ఒకసారి టీటీడీ ఛైర్మన్ అని... మరోసారి ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పదవి అని... ఇలా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్న ప్రతీసారి మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఇంతవరకు మోహన్ బాబుకి ఏ పదవీ కట్టబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి.

అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవులు పొందినవారంతా మొదట్నుంచీ ఆయన వెంట నడిచివారే. విజయ్ చందర్, 30 ఇయర్స్ పృథ్వీ, లక్ష్మీపార్వతి... వైసీపీ ఆరంభం నుంచీ జగన్ కు అండగా ఉన్నారు. అలాగే, పోసాని మురళి కూడా మొదట్నుంచీ జగన్ వైపే ఉన్నారు. మిగతా వారంతా, ఎన్నికలకు ముందు పార్టీలో చేరినవారే.

అందుకే, మొదట్నుంచీ తనతో నడిచినవారికే జగన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. అయితే, ఆ ప్రాధాన్యత క్రమంలో కొందరు ప్రముఖులను ఇంకా పదవులు తలుపు తట్టలేదని, కానీ కచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, మొదట్నుంచీ జగన్ కు అండగా ఉంటూ, చంద్రబాబుపై ఒంటి కాలిపై విరుచుకుపడుతూ... ఘాటు వ్యాఖ్యలుచేసిన పోసానికి ఇంతవరకు పదవి ఇవ్వకపోవడంపై మాత్రం చర్చ జరుగుతోంది.