కోదండరాం వర్సెస్ పొన్నాల

 

కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నియోజక వర్గానికి ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులు టిక్కెట్ కోసం ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు.ఇక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే టిక్కెట్ ఆయనకే కేటాయిస్తారు.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప టిక్కెట్ వేరే వారికి కేటాయించే పరిస్థితి లేదు.కానీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభత్వాన్ని అధికారానికి దూరం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఒక నియోజక వర్గంలో ఇద్దరు ప్రముఖులు ఉండటం వల్ల కాస్త తలనొప్పిగా మారినా ఎలాగోలా బుజ్జగించేది.కానీ ఇప్పుడు కూటమి వల్ల కొన్ని స్థానాలను వదులుకోవాల్సిన పరిస్థితి.దీంతో ఆ పార్టీకి ఎక్కడలేని తంటాలు వచ్చిపడ్డాయి.ముఖ్యంగా కూటమి పార్టీలకు స్థానాల కేటాయింపుపై జరుగుతన్న ప్రచారాలు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించకముందే పలువురు అసంతృప్తి నేతలు ఆందోళనలు చేపడుతున్నారు.ఇప్పటికే పలు నియోజక వర్గాల నేతల్లో టిక్కెట్ విషయంలో ఉత్కంఠత నెలకొనగా తాజాగా జనగామ నియోజవర్గ అభ్యర్థిగా పొన్నాల లక్ష్మయ్య కి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇస్తుందంటూ జరగుతున్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.జనగామ నియోజక వర్గంలో పొన్నాలకు మంచి పేరు ఉంది.పలుమార్లు ఇక్కడి నుంచి చట్టసభల్లోకి అడుగు పెట్టారు.అయితే పొత్తులో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం జనగామ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది.సీట్లు ముఖ్యం కాదు కూటమి గెలుపే లక్ష్యం అనుకుంటే పొన్నాలకే టిక్కెట్ కేటాయించాలి.పొన్నాల కూడా ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు.మరోవైపు పొన్నాలకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.ఏదైతేనేం పొన్నాల మాత్రం జనగామ సీటు తనదే అని గంటాపదంగా చెప్తున్నారు.తప్పుడు ప్రచారాలు చేయటం మంచిది కాదు అని హితవు పలికారు. జనగామ సీటు మరో పార్టీకి ఇస్తే టీఆర్‌ఎస్‌కు మేలు చేసినట్టే అవుతుందని హెచ్చరించారు.తనలాంటి సీనియర్‌ నేత సీటును రెడ్డి వర్గానికి కేటాయిస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు.ఏదైతేనేం కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటిస్తే అందరి ఊహలు పటాపంచలు అవుతాయి.