తీవ్రస్థాయికి చేరుకుంటున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం...

 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగురవేయటానికి టీ.ఆర్.ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగిస్తుంది. గురువారం గులాబీ బాస్ కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. కేసీఆర్ సభతో సమీకరణాలు మారతాయని ప్రచారం సాగుతోంది. రెండు వేల తొమ్మిదిలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పడినప్పట్నుంచి అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. మూడు సార్లు ఉత్తమ్ కుమార్ విజయం సాధించారు, ఉత్తమ్ ఎంపీగా ఎన్నిక కావడంతో అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో టి.ఆర్.ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నాయి. హుజూర్ నగర్ ను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లోనూ ఇన్ చార్జిలను నియమించి ప్రచారం సాగిస్తున్నారు. ఈ నెల నాలుగో తేదీన టీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అన్ని మండలాల్లోనూ వరుసగా రోడ్ షోలు నిర్వహించాలని అనుకున్నా చివరికి కేటీఆర్ ప్రచారం రద్దైంది. ఇక గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లో కేసిఆర్ బహిరంగ సభ నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరాజయం పాలు చేసింది. ఆనాడు కేసీఆర్ చేసిన ప్రసంగం నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లు, సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు కూడా అదే విధంగా హుజూర్ నగర్ లో కేసీఆర్ సభతో టి.ఆర్.ఎస్ దశ తిరుగుతుందని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

టి.ఆర్.ఎస్ విజయం తోనే నియోజక వర్గం అభివృద్ధి బాట పడుతోందని గులాబిదళాలు ఊరూరా ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ సభ రోజునే తమ అభ్యర్థి సైదిరెడ్డి విజయాన్ని ఖాయం చేసుకోవాలని టీ.ఆర్.ఎస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. విజయం కోసం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్న టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించింది. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఉధృత ప్రచారం సాగిస్తోంది. కేసీఆర్ సభలో కూడా హుజూర్ నగర్ కు పలు వరాలు ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ కు చెక్ పెట్టాలని టీ.ఆర్.ఎస్ గట్టిగా నిర్ణయించుకుంది అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది.