వైజాగ్ లోని వందల కోట్లు విలువచేసే ఆశ్రమంపై కన్నేసిన నేతలు!!

ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం వెంకోజీపాలెంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జ్ఞానానంద-రామానంద ఆశ్రమం ఎన్నో ఏళ్లుగా నడుస్తుంది. దీనిపై కొందరు పెద్దల కన్ను పడింది. దీంతో ఈ ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలి అంటూ కొందరు ప్రజా ప్రతినిధులు ఏకంగా దేవాదాయ శాఖకు లేఖలు రాశారు. ఆశ్రమ నిర్వాహకులు స్వామి పూర్ణానంద సరస్వతికి కొందరు ఫోన్ చేసి ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. రిటైర్డ్ పోలీస్ అధికారిని రంగంలోకి దింపి అతనితో బెదిరించారు. ఆశ్రమాన్ని అప్పజెప్పకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. చివరకు రెవిన్యూ అధికారులు కూడా ఆశ్రమానికి వచ్చి స్వామితో రాయబారాలు నడిపారు. దీంతో స్వామి నగరంలో పలువురు ప్రముఖులను కలిసి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నారు.

వెంకోజీపాలెంలో జాతీయ రహదారికి అతి సమీపంలో కొండవాలున 1955లో జ్ఞానానంద సరస్వతి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో శివాలయం కూడా నిర్మించారు. శివాలయంలో దూపదీప నైవేద్యానికి స్థానికులు పీలా అప్పారావు, కోడి సన్యాసి ఆరు ఎకరాల భూమిని 1958 జులై 12న దానం చేస్తూ గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. అదే ప్రాంగణంలో పాఠశాల నిర్వహణ కోసం ఆశ్రమానికి ఆనుకొని ఉన్న 3.31 ఎకరాల కొండ పోరంబోకు భూమిని ప్రభుత్వం కేటాయించింది.

ఈ ప్రాంతంలో గజం రిజిస్ర్టేషన్ విలువ ప్రకారం 50,000 ఉంది. కానీ మార్కెట్ ధర మాత్రం గజం లక్ష వరకు ఉంది. ఆ విధంగా ఆశ్రమ స్థలం విలువ అక్షరాలా 300 కోట్లు. జ్ఞానానంద సరస్వతి కాలం చేసిన తర్వాత ఆయన శిష్యుడు స్వామి పరిపూర్ణానంద సరస్వతి 1980లో ఆశ్రమ బాధ్యతలు స్వీకరించారు. కాగా తానిచ్చిన గిఫ్టు డీడ్ లను రద్దు చేయాలి అంటూ దాత పీల అప్పారావు చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టేయడం విశేషం.