సరుకులిస్తాం.. మందు చీటీలిస్తాం

 

కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల జోరు చిత్ర విచిత్రమైన రూపాలు తీసుకుంటోంది. డబ్బుపంపిణీకి ఇప్పటివరకు ఎక్కడా లేని మార్గాలను ఇక్కడి నాయకులు వెతుక్కుంటున్నారు. మద్యానికి చీటీలు ఇవ్వడం ఎప్పటినుంచో మనకు తెలుసు. నేరుగా మద్యం పంపిణీ చేసే పద్ధతి ఇంతకుముందు ఉండేది. అయితే, అలా తీసుకెళ్తుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేవలం చీటీలు మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ చీటీ తీసుకెళ్లి ఫలానా వైన్ షాపులో ఇస్తే ఉచితంగా మద్యం ఇస్తారని చెబుతారు. ఇప్పుడు అది పచారీ సరుకుల వరకు వెళ్లింది. ఇందులోనూ రెండు రకాలున్నాయి. ఇళ్లకు వెళ్లి చీటీలు ఇచ్చి, అవి చూపిస్తే నెలకు సరిపడ సరుకులు ఉచితంగా ఇవ్వడం ఒకటైతే, నేరుగా పచారీ దుకాణాల్లోనే డబ్బులు తీసుకునేలా 1కె, 1ఆర్ అనే కోడ్ లాంగ్వేజిలో ఉంటున్న చీటీలు రెండో రకం. మచిలీపట్నం ప్రాంతంలోని కొంతమంది నాయకులు ఇలాంటి చీటీలు ఇస్తున్నారు. అందులో 1కె అంటే వెయ్యి రూపాయలని, 1ఆర్ అంటే రెండు వేలని అర్థం. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి ఆయా చీటీల కాంబినేషన్ ఇస్తున్నారు. అవి తీసుకెళ్లి ఆ ప్రాంతంలో ఉన్న పచారీ దుకాణాల్లో చూపిస్తే, దానికి సమానమైన డబ్బు గానీ, సరుకులు గానీ ఇస్తారన్నమాట.