తెలంగాణాపై పట్టు కోసం పార్టీల తిప్పలు

 

ఇక రాష్ట్రవిభజన జరిగిపోయినట్లే గనుక, అన్ని పార్టీలు ఎన్నికల వైతరిణిని దాటేందుకు రాజకీయాలకు ఉపక్రమించుతున్నాయి. తెలంగాణా తెచ్చిన కారణంగా మంచి ఊపుమీదున్న కాంగ్రెస్, తెరాసలు అది తమ ఘనతేనని చెప్పుకోవడం సహజమే. కానీ, చివరి వరకు రెండు నాల్కలతో మాట్లాడిన బీజేపీ కూడా అది తమ గొప్పదనమేనని టముకు వేసుకొంటూ మరికొన్ని సీట్లయినా పెంచుకోవాలని తిప్పలు పడుతోంది.

 

తెదేపా తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ, సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఆలేఖ గురించి, తమ చిత్తశుద్ధి గురించి గట్టిగా చెప్పుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు విభజన అయిపోయింది గనుక ఇప్పుడు చంద్రబాబు కూడా తమ పార్టీ ఇచ్చిన లేఖ గురించి మీడియా ముందు దైర్యంగా ప్రస్తావించి, మిగిలిన అన్ని పార్టీలు మాటమార్చినా, ఇంతవరకు తెలంగాణా ఏర్పాటు చేయమని కోరుతూ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకపోవడం తమ నిబద్దతకు అద్దంపడుతోందని ఆయన అన్నారు. తాము రాష్ట్ర విభజన జరుగుతున్న తీరునినే వ్యతిరేఖించామే తప్ప తెలంగాణా కాదని మరో మారు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో కూడా తెదేపాను దెబ్బ తీయాలనే ఆత్రంలో కేవలం తెదేపా లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేయవలసి వచ్చిందని ప్రకటించడం కూడా తెదేపాకు కలిసి వచ్చింది. అందువలన త్వరలోనే తెదేపా కూడా రంగంలో దిగడం ఖాయం.

 

కాంగ్రెస్-తెరాసలు చేతులు కలపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కానీ, తెదేపా-బీజేపీల పొత్తులు అనుమానమే. ఆ పరిస్థితిలో కాంగ్రెస్-తెరాస-సీపీఐ-మజ్లిస్ కూటమి ఒకవైపు, తెదేపా, సీపీయం, బీజేపీలు వేర్వేరుగా మరో వైపు ఎన్నికల బరిలో నిలుస్తాయి. కానీ, కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపితే వారిని ఈ పార్టీలు ఒంటరిగా ఎదుర్కోవడం చాల కష్టమే అవుతుంది. అందువల్ల మరి తెదేపా-బీజేపీలు పొత్తులకు సిద్దపడతాయా లేదా అనేది ఇంకా తేలవలసి ఉంది. ఒకవేళ తెదేపా దైర్యం చేసి బీజేపీతో ఎన్నికల పొత్తులకి సిద్దపడినప్పటికీ, విజయోత్సాహంతో ఉన్న బీజేపీ తెలంగాణా నేతలు తెదేపాతో పోత్తులకు అంగీకరించవు గనుక ఆ రెండు పార్టీలకి ఒంటరి పోరు తప్పకపోవచ్చును. అదే జరిగితే కాంగ్రెస్-తెరాస కూటమి అందుకు చాలా సంతోషిస్తుంది.