అందరిదీ ఒకటే నినాదం?

 

ఎన్నికలకు పార్టీల మేనిఫెస్టోలు విడుదలయ్యాయి. రాష్ట్రం రెండుగా విడిపోయాక రాజకీయ నేతలు ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారు. మేనిఫెస్టోలు కూడా ఇరు ప్రాంతాలకు వేరు వేరుగా విడుదల చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం మేనిఫెస్టోల కంటే తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని మెజార్టీ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే దానిపై పార్టీలు కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నాయి. పోరాడి తెచ్చుకున్నామని తెరాస, సీమాంధ్ర లో పార్టీ తుడిచి పెట్టుకుపోయినా లక్ష్య పెట్టకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణా ఇచ్చారని కాంగ్రెస్, ఉభయసభల్లో తాము మద్దతు ఇవ్వడం వల్లే బిల్లు ఆమోదం పొందిందని బీజేపీ, విభజనకు అనుకూలంగా తమ పార్టీ లేఖ ఇచ్చిందని టీడీపీ, తాము మొదటి నుంచీ తెలంగాణాకు అనుకూలమని సీపీఐ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నాయి.

 

సమైక్యాంద్రకు కట్టుబడి ఉన్న సీపీఎం, ఎంఐఎం తెలంగాణా అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వెళుతున్నాయి. తెలంగాణాకు తామే పాలకులు కావాలని ఉవ్విళ్ళూరుతున్న నేతలు నవ తెలంగాణా, సామాజిక తెలంగాణా, పునర్ నిర్మాణం పేరుతో ప్రచారం మొదలు పెట్టారు. మరో వైపు కాంగ్రెస్ దళిత ముఖ్యమంత్రి కార్డు ప్రయోగించింది. టీడీపీ బీసి రామబాణంతో దూసుకెళ్తామనే ఆశతో ఉంది. బీజేపీ కూడా బీసీ మంత్రం జపిస్తోంది. అధికారం దక్కించుకునేందుకు ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు, ప్రాంతం, కులం, అభివృద్ధిని అస్త్రాలుగా ప్రయోగించాయి పార్టీలు. చివరికి ఏ మంత్రం ఫలిస్తుందో.. ఎవరిని విజయం వరిస్తుందో ...