సెప్టెంబర్ 2వరకు ఏపీ యన్జీవోలకు కోర్టు గడువు

 

రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా జరుగుతున్నపోరాటానికి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఎదురు దెబ్బలు తగిలాయి.

 

సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ఏపీ యన్జీవోల నిరవదిక సమ్మె చట్ట విరుద్దమని, దానిని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయవలసిందిగా హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలయింది. కోర్టు నోటీసులు అందుకొన్నఏపీ యన్జీవో ప్రతినిధులు ఈ కేసులో తమ ప్రతిస్పందన తెలియజేసేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఇవ్వవలసినదిగా కోర్టును అభ్యర్దించగా, కోర్టు అందుకు అంగీకరించి కేసును వచ్చేనెల రెండవ తేదీకి వాయిదావేసింది. ఒకవేళ హైకోర్టు వారు చేస్తున్న సమ్మె చట్ట విరుద్దమని తేల్చిచెప్పినట్లయితే ఏపీ యన్జీవోలకు ధర్మసంకటం తప్పదు. సమ్మె విరమిస్తే సమైక్య ఉద్యమం నిలిచిపోతుంది. కొనసాగిస్తే చట్టపరమయిన చర్యలు ఎదుర్కోక తప్పదు.

 

ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసారు. అయితే ఆ పిటిషన్ను చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోనందున దానిపై విచారణ జరపటం సరికాదని, అయినా రాష్ట్రాల విభజనపై తగిన నిర్ణయం తీసుకొనేందుకు పార్లమెంటు ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.