గడ్కారి పాయసం గిన్నెలో పిడక వేసిన కాంగ్రెస్

 

మేధోమధనంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే నీతులు అక్కడివరకే పరిమితం అని మరోసారి ఆపార్టీ నిరూపించింది. భారతీయపార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి ఈరోజు మళ్ళీ రెండోసారి పార్టీ అధ్యక్షపదవి చేపట్టనున్న తరుణంలో, మహారాష్ట్ర ఆదాయపన్ను శాఖ ఆయనకి నోటీసులు జారీచేసింది. ఆయన తన నామినేషను పత్రాలు సమర్పించే రోజునే అంటే బుదవారంనాడే, ఆయనని తమ ముందు హాజరయి ఆయనకు చెందిన పూర్తీ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిన్న మద్యాహ్నం వరకూ కూడా తానే మళ్ళీ అధ్యక్ష పదవి చేపడతానని కలలుగన్న నితిన్ గడ్కారి కాంగ్రెస్ దెబ్బకి వెనక్కి తగ్గక తప్పలేదు.

 

అయన రెండో సారి అధ్యక్ష పదవి చెప్పట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నమరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తానూ కూడా బరిలో దిగుతానని ప్రకటించడంతో, పోటీ వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించిన భారతీయపార్టీ అధిష్టానం, అందరికీ ఆమోదయోగ్యుడయిన మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పేరును నిన్న రాత్రి ప్రతిపాదించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

 

కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత వ్యవహారాలలో ఈవిధంగా వేలు పెట్టి ఆడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసించింది. సరిగ్గా సమయం చూసుకొని పావులు కదిపి తమ పార్టీని రచ్చ కెక్కించినందుకు భారతీయపార్టీ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడుతోంది.

 

అయితే, ఇల్లు కాలుతోందని భారతీయ జనతా పార్టీ ఏడుస్తుంటే, చుట్టకి నిప్పు దొరికిందని సంతోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలు యధావిధిగా ఖండించడమే గాకుండా, ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టినందుకు చంకలు గుద్దుకొట్టుకొంటోంది.

 

గడ్కారి మాత్రం తన పాయసం గిన్నెలో కాంగ్రెస్ ఈ విధంగా పిడక వేయడంతో విలవిలలాడుతూ తాను నిర్దోషినని నిరూపించు కోనేంతవరకు పార్టీలో ఏపదవి చేపట్టనని, తన వల్ల పార్టీ ప్రయోజనాలకు భంగం కలగరాదనే ఉద్దేశంతోనే తానూ అధ్యక్షపదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపారు.

మొన్న జైపూరులో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పటిన తరువాత ఉద్రేకంగా నీతులు చెప్పిన రాహుల్ బాబు ఇప్పుడు దీనిని ఏ నీతి అంటారో ఆయనే వివరించాలి.