ప్రజాసేవ కోసం తపిస్తున్న రాజకీయ కోటీశ్వరులు

Publish Date:Apr 9, 2014

 

మన రాజకీయ నేతలలో చాలా మందికి వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని అనడరికీ తెలుసు. అందువల్ల వారు ప్రజలకి సేవ చేయడం మాటెలా ఉన్నా, వారి రాజకీయాలు, అధికారం, పరపతి అన్నీ కూడా తమ వ్యాపారాలను కాపాడుకొంటూ వాటిని మరింత వృద్ధి చేసుకోవడానికి మాత్రం తప్పక సద్వినియోగం చేసుకొంటారని అందరికీ తెలుసు. ఒక మధ్య తరగతి గృహస్తు తన పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకోసం డబ్బు పోగేసేందుకు ఒక జీవిత కాలం శ్రమించవలసి వస్తే, మన రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం పది తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంతగా ప్రతీ ఐదేళ్ళకీ రెండు మూడింతలుగా పెరిగి వందల కోట్లకు చేరుకొంటోంది. ఈ గొప్ప సౌలభ్యం ఉన్నందునే వారందరూ ‘ప్రజాసేవ’ చేసేందుకు ఇంతగా పోటీలు పడుతున్నారు.

 

ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తన ఫారం హౌస్ లో సాగు చేస్తున్నవ్యవసాయం ద్వారా ఏడాదికి ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాని స్వయంగా చెప్పినప్పటికీ, ఆయన తన నామినేషన్ ఫారంలో మాత్రం తన మొత్తం ఆస్తి కేవలం రూ.14.94 కోట్లు మాత్రమే చూపారు. తన భార్య పేరిట రూ. 21 లక్షలు విలువైన చరాస్తులతో బాటు మొత్తం రూ.7,87,53,620 అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. 2012-13లో తన ఆదాయం రూ. 6,59,684లుగా చూపిన కేసీఆర్ 2013-14లో రూ. 8,67,830 ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో పేర్కొన్నారు. కారు గుర్తు గల తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి, ఆయన భార్యకి కూడా తిరిగేందుకు స్వంత కారు కూడా లేదుట!

 

ఇక ఆయన కొడుకు కేటీఆర్ తండ్రి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. తన పేరిట, తన భార్యా పిల్లల పేరిట మొత్తం రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.2.86 కోట్ల స్థిరాస్తులున్నట్లు చెపుతూనే తండ్రి వద్దనుండి రూ.40 లక్షల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికలకీ, ఈసారి ఎన్నికలకీ మధ్య తమ ఆస్తి కేవలం రూ.80లక్షల చిల్లర మాత్రమే పెరిగిందని, అదేవిధంగా రూ. 2 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఎఫిడవిట్లో పేర్కొన్నారు.

 

ఇక దళితులకి రాజ్యాధికారం కావాలని కోరుకొంటున్న దళిత కాంగ్రెస్ నేత-వివేక్ తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ. 205.27కోట్ల స్థిరాస్తులు, రూ. 60.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే వారి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.292.98 కోట్లు మాత్రమేనన్నమాట. అయితే అంత ఆస్తి ఉన్నప్పటికీ వారికీ అప్పులు తీసుకోక తప్పలేదుట. తమ దంపతులు ఇద్దరికీ కలిపి రూ.12.31 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితకోటాలో టికెట్ సంపాదించుకొన్న ఈయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకస్‌భ స్థానానికి పోటీ చేస్తున్నారు.

 

ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన (ప్రముఖ కాంట్రాక్టరు) నామా నాగేశ్వరరావు ఖమ్మం లోక్‌సభకు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన తమ కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ. 338 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయనకీ కూడా అప్పుల బాధ తప్పలేదు. తమకు రూ.21కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

 

మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. మరి ప్రజాసేవలో తరిస్తున్న ఈ రాజకీయ నేతలందరికీ ఆ పుణ్యం ఊరకే పోదు. అందువల్లనే ధనలక్ష్మి వారి ఇళ్ళనే అంటిపెట్టుకొని ఉండిపోయింది. ఆ సంగతి తెలియని వెర్రి జనాలు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ పోగేసుకొన్న పదిరూపాయలు పెట్టి ఆమెకు కొబ్బరి కాయలు కొట్టి, చివరికి ఆ చిప్పలు మాత్రమే మిగుల్చుకొంటున్నారు.

By
en-us Political News