మొదలయిన రాజకీయ వలసల సీజన్

 

ఎన్నికల సమయం క్రమంగా దగ్గర పడుతున్న కొద్దీ మెల్లగా రాజకీయనాయకుల కప్ప గెంతులు కూడా మొదలయ్యాయి. తెదేపా నుండి కొంత మంది తెరాస వైపు వెళ్ళగా, కాంగ్రెస్ నుండి మరికొందరు వైకాపా వైపు దూకుతున్నారు. తెదేపా నుండి బయట పడేందుకు ‘తెలంగాణా’ లేదా ‘పార్టీలో పెత్తందారులు’ కారణాలుగా చెప్పబడుతుంటే, తెరాస నుండి బయట పడేందుకు, కేసీఆర్ నియంతృత్వ ధోరణి, ఆపార్టీకి తెలంగాణాపై చిత్తశుద్ధి లేదనే సాకుతో బయటపడుతున్నారు.

 

ఇక, ఒకే రక్తం పంచుకు పుట్టిన కాంగ్రెస్, వైకాపాల మధ్య కేవలం ‘జగన్’ అనే ఏకైక అంశంతో మార్పులు జరుగుతున్నాయి తప్ప వేరే ఇతర అంశాలు లేవు. జగన్ వ్యతిరేఖించేవారు కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోతే, అతని గెలుపు తద్యం అని భావించేవారు అటువైపు మారుతుంటారు. అయినప్పటికీ, జగన్ అక్రమాస్తుల కేసులు ఆ రెండు పార్టీల మధ్య వీడని, కనబడని ఒక గట్టి బంధం ఏర్పరిచింది. ఆ రెండు పార్టీల వారు ఒకరినొకరు దూషించుకొంటున్నపటికీ, కేసులు రాజీనామాల విషయం వచ్చేసరికి వారందరూ ముక్త కంఠంతో ఎవరూ కూడా తప్పు చేయలేదని చెప్పడం ఇందుకు ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

 

ఈ నాలుగు పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం మొదలుపెట్టగానే ఆ పార్టీల మద్య వలసలు పూర్తి స్థాయిలో జోరందుకోవచ్చును. తెదేప, తెరాసలు రెండు కూడా బహుశః వచ్చే నెలలో ఖచ్చితంగా తమ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది, గనుక అప్పటి నుండి వలసలు మొదలవవచ్చును.

 

ప్రస్తుతానికి మాజీ మంత్రి డీకే సమరసింహా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రుమాండ్ల రామచంద్రయ్య వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. రామచంద్రయ్య గతంలో స్వర్గీయ యన్టీఆర్ కి అత్యంత ఆప్తుడుగా, తెదేపాకు తెలంగాణా ప్రాంతంలో బలమయిన పునాది వేశారు. కానీ, తెలంగాణా ఉద్యమాలు ఊపందుకోవడంతో రెండు సం.ల క్రితం ఆయన పార్టీని వీడి తెరాసలో చేరారు. కానీ, మళ్ళీ ఇప్పుడు తిరిగి తెలుగు దేశం గూటికే చేరుకొన్నారు.

 

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బాజపాలోకి అక్కడి నుండి తెరసలోకి వెళ్ళిన సమర సింహా రెడ్డి కూడా ఈ రోజే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక, ముగ్గురు తెలంగాణా కాంగ్రెస్ యంపీలు మరియు కే.కేశవ్ రావు తదితరులు వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ నుండి తెరాసలో చేరేందుకు ముహూర్తం పెట్టుకొన్నారు. వైకాపా నుండి తాజాగా సస్పెండ్ అయిన కాకాని గోవర్ధన్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది.