కాదన్నా కవాతుకు కదం తొక్కిన జనసైనికులు

 

ప్రజా పోరాట యాత్ర పేరుతో తన ఆలోచనలను, పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు.యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో పిచ్చుకలంక నుంచి కాటన్‌ విగ్రహం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర గంటన్నర సేపు కవాతు నిర్వహించాలనుకున్నారు.కవాతు నేపధ్యంలో విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు బ్యారేజ్‌ పొడవునా జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు.సుమారు రెండు లక్షల మందితో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కవాతు చేయాలని జనసేన నిర్ణయించింది.అనంతరం బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.

 

 

కవాతు నిర్వహణపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టంచేశారు.పవన్‌కు నోటీసులు జారీచేశారు.కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని నోటీసుల్లో పేర్కొన్నారు.బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని, బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భహిరంగ సభకు 10వేల మంది కంటే ఎక్కువ మందికి సభా ప్రాంగణం సరిపోదని తెలిపారు.దీంతో అసలు కవాతు నిర్వహిస్తారా? లేదా? అని జనసైనికులు సందిగ్ధంలో పడ్డారు.కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కవాతు ప్రారంభించారు.

 

 

పవన్‌ కల్యాణ్‌ కాటన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన భారీ కవాతు ఉత్సాహంగా కొనసాగుతోంది.పవన్‌ నేతృత్వంలో ధవళేశ్వరం బ్యారేజీపై భారీ సంఖ్యలో కార్యకర్తలు నినాదాలతో ముందుకు సాగుతున్నారు.ఈ కవాతు సందర్భంగా రూపొందించిన పదా.. పద.. పద సాంగ్‌ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.అభిమానులు,కార్యకర్తల కోలాహలంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఓపెన్‌టాప్‌ వాహనంలో పవన్‌ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంచారు.కవాతు అనంతరం భహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.