హైదరాబాద్ పబ్ లో అశ్లీల నృత్యాలు.. 22 మంది యువతులు అరెస్ట్!

పబ్బులో గబ్బు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు కొందరు యువత. మందు కిక్ లో ఉన్న యువకులకు మగువను ఎరగావేసి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టాట్ పబ్ లో ఆదివారం రాత్రి పోలీసులు చేసిన రైడ్ లో 22 మంది యువతులని అరెస్ట్ చేశారు. పబ్ లో అశ్లీల నృత్యాలు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి 22 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు యువతీ, యువకులు పబ్ లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో భాగంగా కొందరు యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 మంది యువతులను అదుపులో తీసుకుని ప్రైవేట్ బస్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

అయితే పోలీసులకు పట్టుబడిన యువతులు అర్థరాత్రి హల్ చల్ చేశారు. తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని.. తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారని.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లను లాక్కొని క్రింద పడేశారు. కాగా సీడ్స్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే మొన్నటికి మొన్న నగరంలోని లిస్బన్ పబ్ వ్యవహారం కూడా బయటపెట్టారు పోలీసులు. పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో రైడ్ చేసి పలువురు యువతీ యువకులను అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా పబ్ కి వచ్చే యువకులకు అమ్మాయిలను ఎరగా చూపించి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకోని.. గర్ల్ ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు మందు మగువని చూపుతూ క్యాష్ చేసుకుంటున్నారు పబ్ నిర్వాహకులు.